తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై పోరులో పీఎం-కేర్స్​ నిధికి విరాళాల ప్రవాహం - పీఎం​-కేర్స్​ నిధి

పీఎం​-కేర్స్​ నిధికి అన్ని వర్గాల నుంచి విరాళాలు వెల్లువెత్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరుకు... కావాల్సిన నిధుల కొరతను తీర్చేందుకు రాజకీయ నేతలు, కార్పొరేట్లు, రక్షణ దళాలు, రైల్వే, బాలీవుడ్ ప్రముఖులు, పీఎస్​యూ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు సాయం అందిస్తున్నారు.

Support pours in from many quarters for PM's emergency fund to fight coronavirus
పీఎం​-కేర్స్​ నిధికి విరాళాల వెల్లువ

By

Published : Mar 30, 2020, 5:20 AM IST

కరోనా మహమ్మారిపై పోరుకు మానవత్వం కదిలివస్తోంది. పీఎం-కేర్స్​ నిధికి రాజకీయ నేతలు, కార్పొరేట్లు, రక్షణ దళాలు, రైల్వే, బాలీవుడ్ ప్రముఖులు, పీఎస్​యూ ఉద్యోగులు సహా అన్ని వర్గాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

నేతల చేయూత

ఈ ఉద్యమంలో మేము సైతం అంటూ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముందుకొచ్చారు. పీఎం-కేర్స్​ (ప్రధానమంత్రి సిటిజన్​ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్​ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్​) ఫండ్​కు​ రాష్ట్రపతి కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చారు. రాజ్యసభ సభ్యులందరూ తమ నెల వేతనం విరాళమివ్వాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు వెంకయ్య. మరోవైపు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా నెల వేతనం విరాళంగా ప్రకటించారు.

రక్షణ దళాల విరాళం

కరోనాపై పోరాడేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనం సుమారు రూ.500 కోట్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేసింది. అయితే ఉద్యోగులంతా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించవచ్చని, ఇష్టం లేని వ్యక్తులకు మినహాయింపు ఇస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది.

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ తన నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దానితో పాటు తన ఎంపీల్యాడ్స్​ నుంచి కోటి రూపాయలు మొత్తాన్ని పీఎం-కేర్స్​కు అందివ్వాలని ఎంపీల్యాడ్స్ ఛైర్మన్​ను కోరారు.

తమ ఎంపీ నిధుల నుంచి కేంద్రమంత్రులు ప్రకాశ్​ జావడేకర్​ రూ.2 కోట్లు, సహాయమంత్రి కిషన్​రెడ్డి రూ.1 కోటి ప్రకటించారు. మరోవైపు భాజపా ఎంపీలు నెల వేతనం, ఎంపీ ల్యాడ్స్​ నుంచి రూ.కోటి విరాళం అందించాలని పార్టీ అధినాయకత్వం సూచించింది.

వితరణ

రైల్వే ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం సుమారు రూ.151 కోట్లు అందించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు పారామిలటరీ సిబ్బంది.. తమ ఒక రోజు వేతనంలో భాగంగా రూ.116 కోట్ల చెక్కును కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు అందించారు. సీబీఐ ఉద్యోగులు, సెంట్రల్ బోర్డ్​ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉద్యోగులు (రూ.21 లక్షలు) ప్రకటించారు.​ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరు రూ.10,000 చొప్పున వితరణ ప్రకటించారు.

కార్పొరేట్ల చేయూత

బిలియనీర్​ గౌతమ్​ అదానీ తన గ్రూప్ దాతృత్వ సంస్థ ద్వారా రూ.100 కోట్ల పీఎం కేర్స్​కు ప్రకటించారు. ఇప్పటికే టాటా గ్రూప్ రూ.1,500 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్​ రూ.5 కోట్లను అందించాయి. రిలయన్స్ దేశంలోనే తొలి కొవిడ్-19 చికిత్స ఆసుపత్రిని ముంబయిలో ఏర్పాటు చేసింది.

జేఎస్​డబ్ల్యూ రూ.100 కోట్ల ఆర్థికసాయం ప్రటించింది. సజ్జన్ జిందాల్ గ్రూప్​.. ఆరోగ్య కార్యకర్తలను వైద్య పరికరాలు అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే తమ గ్రూప్ ఉద్యోగులు తమ ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్​ కోటక్ రూ.60 కోట్ల విరాళం ప్రకటించారు.

బాలీవుడ్ కదలివచ్చింది..

కరోనాపై పోరుకు బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ముందుకొచ్చారు. రూ.11 కోట్లు విరాళంగా ఇస్తామని ఫిల్మ్​ స్డూడియో టీ-సిరీస్​ అధినేత భూషణ్ కుమార్ తెలిపారు. టీవీ వ్యాఖ్యాత, నటుడు మనీష్ పాల్​ రూ.20లక్షలు, నిర్మాత మురాద్​ ఖేతాని రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు.

ఇంతకు ముందు నటుడు అక్షయ్​కుమార్​ రూ.25 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వరుణ్​ధావన్​ పీఎం-కేర్స్​కు రూ.30 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.25 లక్షలు అందించున్నట్లు తెలిపారు.

మోదీ పిలుపు

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌పై పోరాడేందుకు పీఎం-కేర్స్‌ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ శనివారం(మార్చి 28) ప్రకటించారు. దీనికి ప్రజలు తమ వంతుగా విరాళాలు అందించి కరోనా పోరులో భాగస్వాములు కావాలని కోరారు.

ఇదీ చూడండి:దేశంలో 1000 దాటిన కరోనా కేసులు.. 27 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details