చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గాములను పేల్చివేసే వినూత్న ఆయుధాన్ని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ‘సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో’ (స్మార్ట్)ను ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 11.45 గంటలకు ప్రయోగించారు. ఇది సాఫీగా సాగిందని, అన్ని లక్ష్యాలూ నెరవేరాయని అధికార వర్గాలు తెలిపాయి. సాగర జలాల్లో గప్‌చుప్‌గా సంచరించే శత్రు జలాంతర్గాముల పనిపట్టేందుకు ఈ అస్త్రం ఉపయోగపడుతుంది. హైబ్రిడ్ పరిజ్ఞానం ద్వారా ప్రస్తుత వ్యవస్థను ఆధునికీకరించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఇందులో తేలికపాటి టోర్పిడో వ్యవస్థను ఒక సూపర్ సోనిక్ క్షిపణికి జోడించారు. ఫలితంగా సాధారణ టోర్పిడోలు చేరలేని దూరానికి ఇది చేరుకోగలుగుతుంది.
ఒడిశా తీరంలో 'స్మార్ట్' ప్రయోగం విజయవంతం మన సత్తాకు ఇది నిదర్శనం
హైదరాబాద్‌లో డీఆర్‌డీవోకు చెందిన డీఆర్‌డీఎల్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), విశాఖపట్నంలోని ఎన్‌ఎస్‌టీఎల్, ఆగ్రాలోని ఏడీఆర్‌డీఈ తదితర ల్యాబ్‌లు ‘స్మార్ట్’ రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. తాజా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. జలాంతర్గామి విధ్వంసక యుద్ధరీతిలో ‘స్మార్ట్’ ఒక విప్లవాత్మక అస్త్రమని డీఆర్‌డీవో ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.
- 'స్మార్ట్'ను యుద్ధనౌక నుంచి కానీ తీర ప్రాంతంలో మోహరించిన ట్రక్కు నుంచి కానీ ప్రయోగించవచ్చు.
- యుద్ధనౌక, విమానం నుంచి ‘టు వే డేటా లింక్’ ద్వారా శత్రు జలాంతర్గామి నిర్దిష్ట ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. అందుకు అనుగుణంగా గాల్లో తన పయనాన్ని మార్చుకుంటుంది.
- తొలుత ఇది సాధారణ సూపర్‌సోనిక్ క్షిపణిలా నింగిలోకి దూసుకెళుతుంది. చాలావరకూ ఇది గాల్లో తక్కువ ఎత్తులోనే పయనిస్తుంది.
- జలాంతర్గామికి దగ్గరగా వచ్చాక గాలిలోనే ఈ క్షిపణి నుంచి టోర్పిడో వ్యవస్థ విడిపోయి.. నీటిలోకి ప్రవేశిస్తుంది. జలాంతర్గామి దిశగా వెళ్లి దాన్ని పేల్చేస్తుంది.
స్మార్ట్ ప్రయోగం విజయవంతంపై డీఆర్డీఓ అధికారులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:బాలేశ్వర్‌లో శౌర్య క్షిపణి ప్రయోగం విజయవంతం