తెలంగాణ

telangana

By

Published : May 19, 2020, 7:55 PM IST

ETV Bharat / bharat

బలహీనపడిన అంపన్- వడివడిగా తీరంవైపు

సూపర్​ సైక్లోన్​ అంపన్ బలహీనపడింది. ఇవాళ మధ్యాహ్నానికి ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా రూపాంతరం చెందిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బంగాల్​లోని దిఘాకు 670 కి.మీ దూరంలో ఉన్న తుపాను.. ఉత్తర ఈశాన్యంవైపు గంటకు 14 కి.మీ వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఉన్న బంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

amphan
బలహీనపడిన అంపన్ తుపాను

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించిన సూపర్​ సైక్లోన్ 'అంపన్'​ బలహీనపడి అత్యంత తీవ్ర తుపానుగా మారినట్లు అధికారులు తెలిపారు. బంగాల్, ఒడిశా తీరాలవైపు ఈ తుపాను కదులుతున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్​కు దక్షిణాన 520 కి.మీ, బంగాల్​లోని దిఘాకు దక్షిణ నైరుతి వైపు 670 కి.మీ దూరంలో ఉన్న ఈ తుపాను.. ఉత్తర ఈశాన్యంవైపు 14 కి.మీ వేగంతో కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. గంటకు 155-165 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచంఢ గాలులతో పాటు భీకరమైన వర్షాలతో తుపాను​ తీరం దాటనున్నట్లు స్పష్టం చేసింది.

బంగాల్ తీర ప్రాంతాల్లో మే 20 మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య తుపాను తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలిపింది ఐఎండీ. మెదినిపుర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హవ్​డా, హూగ్లీ, కోల్​కతాలో తుపాను ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఒడిశాలోని బాలేశ్వర్, జజ్​పుర్, భద్రక్, జగత్​సింగ్​పుర్​​, కేంద్రపాడా జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది.

బుల్​బుల్​ తుపాను వల్ల జరిగిన నష్టంతో పోలిస్తే అంపన్ మరింత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

నిర్మానుష్యంగా మారిన ఒడిశాలోని సముద్ర తీరం

రాష్ట్రాలు అప్రమత్తం

తీరం వైపు తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో బంగాల్, ఒడిశా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. ఆహార పదార్థాలతో పాటు అత్యవసర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశాయి. విద్యుత్, టెలికాం సేవలను పునరుద్ధరించడానికి బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపాయి.

దాదాపు 3 లక్షల మంది ప్రజలను తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయించినట్లు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వీరందరినీ సహాయక శిబిరాలకు తరలించినట్లు వెల్లడించారు. ఆశ్రయం పొందుతున్న ప్రజలు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతంగా పరిగణిస్తున్న ప్రాంతాల్లో ఉన్న 11 లక్షల మంది ప్రజలను తరలించడానికి సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కొంతమందిని తరలించినట్లు తెలిపారు.

బీచ్​ ఖాళీ

తుపాను ప్రభావంతో బంగాల్​ దిఘా బీచ్​లోని ఉన్న వ్యాపారులు అధికారుల ఆదేశాలతో ఆయా ప్రదేశాలను ఖాళీ చేశారు. స్థానిక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఓ ఎన్​డీఆర్​ఎఫ్ బృందం బీచ్ ప్రాంతంలో కాపలా కాస్తోంది.

ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్న ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది
బీచ్​ వద్ద ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది
దిఘా బీచ్: దుకాణాల్లోని సామాగ్రిని తరలిస్తున్న వ్యాపారులు

ఎన్​డీఆర్​ఎఫ్ సిద్ధం

తుపాను ప్రభావం ఎదుర్కొంటున్న ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే 41 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను మోహరించారు అధికారులు. సహాయక బృందాలకు శాటిలైట్ ఫోన్లు, వైర్​లెస్​ సమాచార పరికరాలు అందించినట్లు తెలిపారు. 1999లో సంభవించిన సూపర్​ సైక్లోన్​ను దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సైన్యం, నౌకాదళానికి చెందిన సహాయక బృందాలను సైతం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

పోస్టులను తరలించిన బీఎస్​ఎఫ్

అంపన్ నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. భారత్​-బంగ్లాదేశ్ నదీ సరిహద్దులో సుందర్​బన్, ఇచ్ఛామతీ నదీతీరంలో ఉండే మూడు తేలియాడే పోస్టులు(నౌకలు), 45 పెట్రోలింగ్ బోట్లను సురక్షిత ప్రదేశానికి తరలించింది. దాదాపు 350 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ సరిహద్దును కాపలా కాసేందుకు దక్షిణ బంగాల్ ఫ్రాంటియర్​ ఈ మూడు పోస్టులను ఉపయోగిస్తోంది. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఇందులోని సిబ్బంది భౌగోళిక సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details