అయోధ్య కేసులో వెలువడిన తీర్పును అన్ని వర్గాలు గౌరవిస్తున్నట్టుగా చెబుతున్నాయి. మరో వైపు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఎవరికి వారు సిద్ధం అవుతున్నారు . ఈ కేసులో కక్షిదారుగా ఉన్న యూపీ సున్నీవక్ఫ్ బోర్డు ... సుప్రీం తీర్పును గౌరవిస్తున్నప్పటికీ తాము అసంతృప్తిగా ఉన్నామని తెలిపింది. అయితే తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని పేర్కొంది. సుప్రీం నిర్ణయం తర్వాత దేశ పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని .. ఏ వైపు నుంచి ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకూడదని పిలుపునిచ్చింది.
మరో వైపు ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. అయోధ్య తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజ్యాంగంపై తమకు పూర్తి నమ్మకం ఉందని హక్కుల కోసం పోరాడతామన్నారు. మసీదు కోసం ప్రత్యేకంగా ఇచ్చిన 5 ఎకరాల స్థలం తమకు అవసరం లేదని.. తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.
జాతీయ మైనారిటీ కమిషన్ సంతృప్తి
సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఎంఐఎం అసంతృప్తి వ్యక్తం చేయగా జాతీయ మైనారిటీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుతో ముస్లింలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు ఎన్సీఎం చైర్ పర్సన్ గైరుల్ హసన్ రిజ్వీ. సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన ఎన్సీఎం ఇంతకన్నా మంచి తీర్పు వస్తుందని ఆశించలేమన్నారు. ఈ తీర్పు జాతీయ సమగ్రతకు సోదర భావానికి, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వెల్లడించారు.
స్వాగతించిన అజ్మేర్ దర్గా
అయోధ్యపై వెలువడిన చారిత్రక తీర్పును రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్మేర్ దర్గా స్వాగతించింది. తీర్పు నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని దర్గా మతపెద్ద దీవాన్ జైనులబ్దీన్ అలీఖాన్ కోరారు. 'న్యాయవ్యవస్థ అత్యున్నతమైంది. అయోధ్యపై తీర్పు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది . మనదేశ ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయమిది' అని అన్నారాయన. ఈ తీర్పు నేపథ్యంలో మనమెంత శాంతికాముకులమో తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు అలీఖాన్.
ఇదీ చూడండి: అయోధ్య కేసు: సుప్రీం తీర్పులో ప్రధానాంశాలివే..