ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో మసీదుతో పాటు ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మించాలని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశమైన వక్ఫ్ బోర్డు.. ఐదెకరాల స్థలాన్ని స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
"ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని స్వీకరించడానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ స్థలంలో మసీదుతో పాటు, ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం, గ్రంథాలయం, ఆస్పత్రి సహా ఇతర సదుపాయాల నిర్మాణాలు చేపడతాం."
-జాఫర్ ఫరూక్, సున్నీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్
త్వరలోనే మసీదు నిర్మాణ పనులు ట్రస్ట్ ప్రారంభిస్తుందని, స్థానిక అవసరాలకు అనుగుణంగా మసీదు పరిమాణం ఉంటుందని జాఫర్ తెలిపారు.
చారిత్రాత్మకమైన తీర్పు
దశాబ్దాలుగా కొనసాగిన రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం గతేడాది నవంబర్ 9న చారిత్రక తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించేందుకు అనుమతిచ్చింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీకోర్టు ఆదేశాలనుసారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం... అయోధ్యకు 20 కిలోమీటర్లు దూరంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
ఇదీ చూడండి:'భారత్-అమెరికా మధ్య అద్భుత వాణిజ్య ఒప్పందం'