కర్ణాటకలోని మండ్య లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు సుమలత. గెలుపు అనంతరం తనకు సహకరించిన పలువురిని కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నారామె. తాజాగా భాజపా నేత ఎస్ఎం క్రష్ణతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు. ఈ నేపథ్యంలో సుమలత భాజపాలో చేరతారనే వార్తలకు మరింత ఊతమొచ్చింది.
" నేను ఇంతవరకు నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు. మండ్యకు వెళ్లి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి. మే 29, నా భర్త జన్మదినం సందర్భంగా మండ్యకు వెళ్తాను. నా విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఈ కీర్తి వర్తిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అత్యంత క్లిష్టమైన ఎన్నికలు ఇవేనేమో. చాలా మంది నాకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో 222 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారందరిలో కేవలం ఒక్కరే విజయం సాధించారు. అది నేనే కావడం చాలా సంతోషం."
- సుమలత, మండ్య ఎంపీ
భాజపా గెలుపుపై హర్షం
దేశ ప్రజలు భాజపాకు సంపూర్ణ మెజారిటీ అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు సుమలత. ప్రజలు ఒకే పార్టీకి అఖండ విజయం అందించారని... ఇలాంటి ప్రజాతీర్పు ఎంతో ఉపయోగకరమైందని అభిప్రాయపడ్డారు. ఏదైనా పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడే వారు అనుకున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయగలరని ఆశిస్తున్నానన్నారు. భాజపాపై సానుకూల ప్రకటనలు చేసిన నేపథ్యంలో సుమలత త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని అంతా భావిస్తున్నారు.