ప్రఖ్యాత సూఫీ సాధువు క్వాజా మొయినుద్దీన్ చిస్తీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన యాంకర్‌పై నమోదైన కేసుల్ని కొట్టివేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 'ఆర్ పార్'పేరిట ఓ టీవీ ఛానల్లో ప్రసారం అయ్యే షోలో జూన్ 15న వ్యాఖ్యాత అమిష్ దేవగన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. షోలో చర్చ సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీని బందిపోటుగా పేర్కొనే సందర్భంలో అనుకోకుండా చిస్తీ పేరు ప్రస్తావించానని, ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పానని అమిష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు అతనిపై నమోదైన కేసులు కొట్టివేసేందుకు నిరాకరించింది. అయితే ఈ కేసుల్లో పోలీసులు ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుడా రక్షణ కల్పిస్తామని పేర్కొంది. సమాజంపై ప్రభావం చూపగలిగే వ్యక్తులు.. వాక్ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోవటంలో మరింత బాధ్యతాయుతంగా ఉండాలంది. ఉద్దేశాలను వ్యక్తపరిచే విషయంలో ఉపయోగించే పదాలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలని సూచించింది.
రిపబ్లిక్ ఛానల్ ఉద్యోగుల పిటిషన్ తిరస్కరణ