ఐకమత్యానికి, సామాజిక వైవిధ్యానికి భారతదేశం ప్రతీక. దేశంలో అన్ని వర్గాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భాషాపరమైన గుర్తింపు ఇందులో చాలా ముఖ్యమైనది. ఒకే భాష మాట్లాడే ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేలా లభించే విధంగా భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల విభజన జరిగింది. అయితే రాష్ట్రాల సరిహద్దులను నిర్వచించే సమయంలో.. మిశ్రమ జనాభా కలిగిన ప్రాంతాలు ఏదో ఒక రాష్ట్రంలోకి వెళ్లాయి. దీంతో భాషా మెజారిటీ ఉన్న రాష్ట్రానికే తమ ప్రాంతాన్ని జత చేయాలని పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపించాయి. పలు రాష్ట్రాలు భాషా పరమైన మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకున్నాయి.
అయితే రాష్ట్రాల పునర్విభజనలో చేసిన పొరపాట్లు ఇప్పుడు ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నిద్రాణ స్థితిలో ఉన్న సమస్యలు బట్టబయలు కావడం వల్ల రాష్ట్రాల మధ్య శాంతి, సామరస్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది దేశ సమైక్యతపైనా ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటకలో మరాఠీవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ట్వీట్ ఈ ప్రకంపనలకు కారణమైంది. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య చిచ్చు పెట్టింది. బెళగావి సహా మరాఠీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేస్తామని ఠాక్రే ప్రకటించడమే ఇందుకు కారణం.
ఇదీ చదవండి:ఠాక్రే వ్యాఖ్యలపై కన్నడ నేతల మండిపాటు
వివాదం ఏనాటిదో..
ఈ జిల్లాపై ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి వివాదం ఉంది. బెళగావి తమ ప్రాంతమని రెండు రాష్ట్రాలు ప్రకటించుకుంటున్నాయి. బెళగావిలోని మరాఠీ ప్రజలు మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి నేతృత్వంలో ఉద్యమాన్ని కూడా నడిపించారు. ఈ ప్రాంతాన్ని మహారాష్ట్రతో కలపాలని డిమాండ్ చేశారు. అయితే, మహారాష్ట్ర వాదనను కర్ణాటక ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. బెళగావిపై తమ హక్కును సుస్థిరం చేసేందుకు ఆ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ శాసనసభ భవంతిని సైతం నిర్మిస్తోంది.
బెళగావి నగర కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడూ మహారాష్ట్ర ఏకీకరణ్ సమితికి కర్ణాటకలోని మిగిలిన పార్టీలకు మధ్య హోరాహోరీగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ చేసిన ట్వీట్.. ఇక్కడి స్థితిని మార్చేసింది. జిల్లాను మహారాష్ట్రలో కలిపేయాలనే ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని శివసేన భావిస్తోంది. శివసేన రాజకీయాలు భాషాపర అభిమానం, హిందుత్వ భావజాలంతో ముడిపడి ఉంటాయి. కానీ, కర్ణాటకలోనూ భాషాభిమానం తక్కువేం కాదు.