తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెబల్​ స్టార్​పై నిలిచి గెలిచేనా?

కర్ణాటకలో లోక్​సభ స్థానాల సంఖ్య 28. అందరి దృష్టి మండ్యపైనే. కారణం... ఓ మహిళ. అధికార కూటమికి సవాలు విసురుతూ ఒంటరిగా బరిలో దిగారామె. మండ్యలో ఏం జరగబోతుంది? జేడీఎస్​-కాంగ్రెస్​ వ్యూహమేంటి?

రెబల్​ స్టార్​పై నిలిచి గెలిచేనా?

By

Published : Mar 19, 2019, 3:40 PM IST

Updated : Mar 19, 2019, 8:57 PM IST

రెబల్​ స్టార్​పై నిలిచి గెలిచేనా?
సామాజిక సమీకరణం, వారసత్వం, సానుభూతి... రాజకీయాల్లో కీలకాంశాలు. ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేవి అవే. వీటి మద్దతు ఎవరికి ఉంటే... వారే విజేతలు. మరి సామాజిక వర్గం మద్దతు, వారసత్వం విషయంలో... పోటీదారులు ఇద్దరూ ఒకటైతే ఎలా ఉంటుంది? కర్ణాటక మండ్య లోక్​సభ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న హోరాహోరీ పోరులా!

ఒక్కలిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ​ప్రాంతం మండ్య. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 నియోజకవర్గాల్లో జేడీఎస్​ జయకేతనం ఎగరవేసింది. ఇప్పుడు మండ్య లోక్​సభ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా దక్కించుకుంది. అక్కడి నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్​ గౌడను పోటీకి దింపుతోంది.

మండ్య రాజకీయ తెరపైకి అనూహ్యంగా సినీనటి సుమలత వచ్చారు. గతేడాది మరణించిన మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత, రెబల్​ స్టార్​ అంబరీశ్​ భార్య ఆమె. మండ్య నుంచి కాంగ్రెస్​ టికెట్​ కోసం సుమలత ప్రయత్నించినా... కుదరలేదు. పొత్తులో భాగంగా జేడీఎస్​కు ఆ సీటు ఇచ్చేశామని చెప్పింది కాంగ్రెస్​. తర్వాత... ఎన్నో నాటకీయ పరిణామాలు. చివరకు... మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు సుమలత.

నేను సానుభూతి ఓట్ల కోసం రాలేదు. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో రావచ్చు. ఉత్తర బెంగళూరు, దక్షిణ బెంగళూరు నుంచి పోటీ చేయాలని, ఎమ్మెల్సీ పదవి తీసుకోవాలని ప్రతిపాదనలు వచ్చాయి. వాటన్నింటినీ తిరస్కరించాను. నాకు మండ్య తప్ప వేరే ఆలోచనే లేదు. ఇదే సరైన దారి అని నమ్ముతున్నాను.
- సుమలత, సినీ నటి

హోరాహోరీ....

మండ్యలో జేడీఎస్​కు మంచి పట్టు ఉంది. అక్కడ ఎక్కువగా ఉండే ఒక్కలిగ సామాజిక వర్గం మద్దతు ఆ పార్టీకే. కాంగ్రెస్​ అండ ఎలానూ ఉంది. అధికారంలో ఉండడం మరో సానుకూలాంశం. అయినా... నిఖిల్​ గౌడ గెలుపు అంత సులువు కాదు. ఇందుకు కారణం... సుమలత కుటుంబానికి మండ్యలో ఉన్న ఆదరణ.
మండ్య లోక్​సభ స్థానం నుంచి గతంలో 3 సార్లు గెలిచారు​ అంబరీశ్. అప్పుడు ఒక్కలిగ సామాజిక వర్గం ఆయనకే మద్దతిచ్చింది. వారి సహకారాన్ని తిరిగి పొందే లక్ష్యంతో సుమలత ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

మండ్య కేంద్రంగా జరుగుతున్న తెరవెనుక రాజకీయం... జేడీఎస్​-కాంగ్రెస్​ కూటమిని మరింత కలవరపెడుతోంది. తనకు టికెట్​ ఇవ్వకుండా నిఖిల్​ను బరిలోకి దింపడంపై జేడీఎస్​ సిట్టింగ్​ ఎంపీ శివరామ గౌడ గుర్రుగా ఉన్నారు. ఇటీవలే భాజపా నేతల్ని కలిశారు. సుమలతతోనూ భాజపా నేతలు మాట్లాడడం జేడీఎస్​ నేతల్లో ఆందోళనను పెంచుతోంది. అధికార కూటమికి పరువు-ప్రతిష్ఠల సమస్యగా మారిన మండ్య పోరు... చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.

ఇవీ చూడండి:దిల్లీలో చీపురు వైపు హస్తం చూపు

Last Updated : Mar 19, 2019, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details