దేశ జనాభా 2048 నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. నాటికి సుమారు 160 కోట్లకు చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గనుందట. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తల అధ్యయనం లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైంది. ఈ శతాబ్ది రెండో భాగంలో భారత్ జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. 2048తో పోలిస్తే 2100 నాటికి దేశ జనాభా 32 శాతం తగ్గి 109 కోట్లకే పరిమితమవుతుంది. అయినప్పటికీ ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశంగానే నిలుస్తుందని అధ్యయనం పేర్కొంది.
చైనాను అధిగమించనున్న భారత్
భారత్లో పనిచేసే వయసున్న జనాభా 2017లో 76.2 కోట్లు ఉండగా... 2100 నాటికి 57.8 కోట్లకు తగ్గుతుంది. ఇదే సమయంలో చైనాలో 95 కోట్ల నుంచి 35.7 కోట్లకు తగ్గిపోతారు. ఆసియాలోని కొన్ని ప్రధాన శక్తుల్లో భారత్ ఒకటిగా నిలుస్తుంది. అయితే శతాబ్దం చివరి వరకు యువ జనాభాను కాపాడుకోగలగాలి. పనిచేసే వయసున్న జనాభా సంఖ్యలో 2020 మధ్యలోనే చైనాను భారత్ అధిగమిస్తుండడం గమనార్హం.
నాలుగో స్థానానికి అమెరికా
ప్రపంచ జనాభా సైతం ఈ శతాబ్ది రెండో అర్ధభాగం తర్వాత తగ్గిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, 195 దేశాల్లోని మరణాలు, జననాలు, వలసల రేటును పరిగణనలోకి తీసుకున్నాక ఈ అంచనాకు వచ్చినట్లు అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత అగ్రరాజ్యం అమెరికా జనాభా 2062 నాటికి 36.4 కోట్లకు చేరుతుంది. 2100 నాటికి 33.6 కోట్లకు పరిమితమై అత్యధిక జనాభా దేశాల్లో నాలుగో స్థానంలో నిలుస్తుంది. అది కూడా ఆ దేశంలోకి వలస వచ్చే వారితోనే సాధ్యమవుతుంది. అయితే ఇంతకాలంగా అమెరికాలో ఉన్న ఉదార వలస విధానాలు ఇటీవల కాలంలో రాజకీయ రంగు పులుముకున్న.. ఫలితంగా ఆ దేశ జనాభా, ఆర్థిక వృద్ధిని కొనసాగించే సామర్థ్యం తగ్గుతుందని అధ్యయనం హెచ్చరించింది. 2100 నాటికి ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 2.37 బిలియన్లు ఉంటే, 20 ఏళ్ల లోపువారు కేవలం 1.7 బిలియన్లే ఉంటారని అంచనా.