తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హరిత' లేనిదే బతకలేని ఆదర్శ గురువు

దేశ అభివృద్ధికి యువకులే కీలకం. యువత తలుచుకుంటే సమాజాన్ని మారుస్తుంది. అక్షరాలా ఇది నిజమని నిరూపించాడు 'ట్రీ మ్యాన్'​. హరిత పాఠశాల పెట్టి ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకు శిక్షణనిస్తున్నాడు. గురు దక్షిణగా  కేవలం 18 మొక్కలను స్వీకరిస్తూ పర్యావరణ హితుడయ్యాడు.

ఆదర్శ గురువు: 'హరిత' లేనిదే బతకలేడతను!

By

Published : Jul 17, 2019, 6:33 AM IST

'హరిత' లేనిదే బతకలేని ఆదర్శ గురువు

బిహార్​ సమస్తీపూర్​ జిల్లా రోస్​డా ప్రాంతంలోని డరహా గ్రామంలో రాజేశ్​ కుమార్​ సుమన్​ అలియాస్​ ట్రీ మ్యాన్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రకృతిని ప్రేమించమని అందరూ ఉపన్యాసాలిస్తారు కానీ సుమన్​ ఆచరిస్తూ మొక్కల గురువుగా పేరు పొందాడు. హరిత పాఠశాలను స్థాపించి ఔత్సాహికులకు ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాడు. గురు దక్షిణగా మాత్రం 18 మొక్కలను నాటాలంటాడు.

అదే ఆయన వసూలు చేసే ఫీజు.

పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుక ఏదైనా సరే మొక్కలు నాటడం ఆయనకు అలవాటు. అంతే కాదు 'బేటీ బచావో బేటీ పడావో' వంటి సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. సమాజానికి ఏదో చేయాలన్న తపనే ఆయన పొలంలో భిన్నంగా హరిత పాఠశాల నిర్మించేలా చేసింది.

సుమన్​ బీఎస్​ఎస్​ అనే గ్రూప్​ను స్థాపించాడు. అందులో సుమన్​ వలె పర్యావరణమంటే అభిరుచి ఉన్న వాళ్లు సభ్యులయ్యారు. 'తగ్గిపోతున్న ప్రాణవాయువును పెంచుదాం' అనే నినాదంతో ముందుకు సాగుతున్నాడు ఈ ఆదర్శ యువకుడు.

"నన్నందరూ మొక్కల గురువు, ట్రీ మ్యాన్​గా పిలుస్తారు. నేను హరిత పాఠశాల నడుపుతాను. ఇందులో విద్యార్థులకు కాంపిటీటివ్​ పరీక్షలకు శిక్షణ ఇస్తాను. 18 మొక్కలను ఫీజుగా తీసుకుంటాను. అందుకే విద్యార్థులు నన్ను మొక్కల గురువు అంటారు. నేనిప్పటి వరకు ప్రభుత్వ సహకారం కోరలేదు. నేను యువకుడిని. దేశంలో యువకులు ఏదైనా చేయగలుగుతారు. నా చిన్నతనంలో నేను మొక్కలు నాటితే త్వరగా ఫలాలిస్తాయని మా నాన్న చెప్పేవారు. అప్పటి నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ మొక్కలు నాటించేవారు. బిహార్​లో అడవులు కేవలం ఆరు శాతం ఉన్నాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. "

-రాజేశ్​ కుమార్​ సుమన్​, ట్రీ మ్యాన్

విదేశాంగ శాఖలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవకు అంకితమయ్యాడు. కాలుష్య రహితంగా సమాజాన్ని మార్చాలని ఒక్కడు వేసిన అడుగుకు నేడు వేలాది మంది మద్దతిస్తున్నారు. చెట్లను పెంచాలన్న సందేశాన్ని వ్యాపింపజేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు.

ఇదీ చూడండి:'జీవితాంతం టోల్​ కట్టాల్సిందే.. రద్దు కుదరదు'

ABOUT THE AUTHOR

...view details