పులి భయంతో విల్లు, బాణంతో బడికెళుతున్న విద్యార్థులు ఝార్ఖండ్-బంగాల్ సరిహద్దులోని ఘాట్షిలా ప్రజలు భయంభయంగా జీవిస్తున్నారు. ఆ పరిసరాల్లో బంగాల్ పులి సంచరిస్తోందన్న వార్తలతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలోని ప్రతిఒక్కరూ ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు కర్రతో చేసిన విల్లు, బాణం వెంటతీసుకెళుతున్నారు.
ఘాట్షిలా పూర్తిగా కొండప్రాంతంలో ఉంటుంది. ఊరి చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఇక్కడ అడవి జంతువులు సంచరించటం మామూలే. అప్పుడప్పుడు దాడులు కూడా చేస్తుంటాయి. అయితే పులి లాంటి క్రూరమృగం వచ్చిందన్న వార్తలతో ప్రస్తుతం అక్కడి ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు.
ఏనుగు కూడా..
పులితో పాటు రెండు రోజుల క్రితం ఘాట్షిలా పక్కనే ఉన్న ముగిటాంగ్లో ఏనుగు బీభత్సం సృష్టించింది. మధ్యాహ్న భోజన సమయంలో స్థానిక పాఠశాలకు వెళ్లి విధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి హాని కలగకుండా నిత్యం కాపలా కాస్తున్నారు.
అటవీ శాఖ భరోసా
కొండ చుట్టూ ఉన్న గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నారు. బంగాల్ పులిని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: కోర్టు బయట రాజ్యాంగ పీఠిక చదివిన లాయర్లు.. కారణమిదే!