చలి కాలంలో ఓ వైపు మంచు.. మరోవైపు పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి వచ్చే పొగ వల్ల దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతుంది. ప్రతి ఏటా ఎదుర్కొనే ఈ ఇబ్బందులకు ఓ పరిష్కారం సూచించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పంట మొదళ్లను కాల్చడం ద్వారా తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం సూచిస్తూ.. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు లేఖ రాశారు కేజ్రీవాల్.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్ఐ) అభివృద్ధి చేసిన రసాయన సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అతి తక్కువ ఖర్చుతో కూడిన ఈ రసాయనం వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయని కేజ్రీవాల్ చెప్పారు.
"ఐఏఆర్ఐ శాస్త్రవేత్తలు ఓ రసాయనాన్ని అభివృద్ధి చేశారు. ఇది పంట మొదళ్లను కుళ్లిపోయేలా చేసి ఎరువుగా మార్చుతుంది. దీన్ని ఉపయోగిస్తే పంట మొదళ్లను రైతులు కాల్చేయాల్సిన అవసరం లేదు. పంట మొదళ్లను కాల్చివేయడం ద్వారా మట్టి సారాన్ని కోల్పోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి పంట వ్యర్థాలను ఎరువుగా మార్చేస్తే.. ప్రత్యేకంగా ఎరువులు వాడటం తగ్గుతుంది."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
పంట దహనాలను అరికట్టేందుకు దిల్లీ ప్రభుత్వం ఈ రసాయనాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు కేజ్రీవాల్. పొరుగున ఉన్న రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
రైతుల జేబులకే చిల్లు!