పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ హింసకు పాల్పడుతున్న నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విధ్వంసానికి తావులేదని తేల్చిచెప్పారు.
పౌరసత్వ చట్టాన్ని సవరించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు సోనోవాల్. 'అసోం ఒప్పందం'లోని 6వ నిబంధన ద్వారా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, రాజకీయ, భూ హక్కులకు పూర్తి భద్రత ఉందని తెలిపారు.
"నేను అసోం ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాను. స్థానిక ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లదని నేను భరోసా ఇస్తున్నాను. శాంతియుతంగా ఆందోళనలు చేపడితే మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ... నిరసనల పేరిట విధ్వంసానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవు. కొందరు కావాలనే, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. "
-శర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి
ఇదీ చదవండి:ఎన్ఆర్సీపై ఎవరూ అధైర్యపడొద్దు: సోనోవాల్