తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' నిరసనల వెనుక కాంగ్రెస్​ హస్తం: సీఎం - CAB

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా అసోంలో జరుగుతున్న నిరసనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్​ స్పందించారు. ఈ ఆందోళనల వెనుక కాంగ్రెస్​ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పని స్పష్టం చేశారు.

Strong action against those involved in violence: Assam CM
'పౌర' నిరసనల వెనుక కాంగ్రెస్​ హస్తం: సీఎం

By

Published : Dec 13, 2019, 11:36 PM IST

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ హెచ్చరించారు. ఈ నిరసనల వెనుక.. భాజపా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రెండు రోజులుగా అసోంలో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు సోనోవాల్​. ఈ విధ్వంసం వెనుక కాంగ్రెస్‌ పార్టీ, మత శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. కొందరు వామపక్షవాదుల ప్రమేయం కూడా ఉందన్నారు.

సహించము...

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే ఏ చర్యలనూ ప్రభుత్వం సహించబోదని, విధ్వంసానికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని సీఎం హెచ్చరించారు. స్థానిక ప్రజల హక్కులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని మరోసారి హామీ ఇచ్చారు. ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హానీ జరగదని తెలిపారు.

కొందరు కావాలనే తప్పుడు సమాచారం చేరవేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సోనోవాల్‌ ఆరోపించారు. తమ సంస్కృతి, భాష, భూమికి సంబంధించిన హక్కులకు అసోం ఒప్పందంలోని క్లాజ్‌ 6 కింద రక్షణ ఉందని చెప్పారు. కేంద్రం కూడా వాటి రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

భగ్గుమంటున్న నిరసనలు...

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా అసోంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ ఆందోళనల్లో ముగ్గురు మృతిచెందారు. గువాహటి, డిబ్రుఘర్‌, తేజ్‌పుర్‌, దెకియాజులిలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. పలు పట్టణాల్లో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తున్నారు.

ఇదీ చూడండి:- పౌర సెగ: ఈశాన్య రాష్ట్రాల్లో దుకాణాల వద్ద జనం బారులు

ABOUT THE AUTHOR

...view details