సామాన్య ప్రజలతో పోల్చితే.. కేన్సర్‌తో బాధపడుతున్న వారు, ఇంకా ఆ వ్యాధి నుంచి బయటపడిన వారిలోనే రెండు రెట్లు అధిక శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక తేల్చింది. భయంకర కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న సుమారు 7 మిలియన్ల మందిపై సర్వే చేసి ఈ నివేదిక తయారు చేసింది. అమెరికాకు చెందిన నేషనల్కేన్సర్ ఇన్స్టిట్యూట్ సర్వైలెన్స్, ఎపిడెమియోలజీ, ఎండ్ రిజల్ట్స్ (ఎస్ఈఈఆర్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ సర్వే చేపట్టారు. ఈ నివేదికను అమెరికా జర్నల్ 'నేచర్ కమ్యూనికేషన్' వార్తా సంస్థ ప్రచురించింది.
ఎస్ఈఈఆర్ వద్ద 1992-2015 మధ్యకేన్సర్ వ్యాధి బారిన పడిన సుమారు 7.2 మిలియన్ల మంది బాధితుల వివరాలు సేకరించారు పరిశోధకులు. రొమ్ము, పెద్ద పేగు భాగాలకుకేన్సర్ సోకిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.
"గతంలోని పరిశోధనల ఆధారంగాకేన్సర్ బాధితులు ఆ వ్యాధితో మరణించటం లేదు. దానికి మరేదో కారణం ఉంది. ఇందుకు గుండెపోటు ఒక కారణం. గుండెపోటు ద్వారా సంభవించే మరణాల నుంచి కాపాడుకునేందుకు మా పరిశోధనలు ఉపయోగపడతాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారిని గుర్తించేందుకు సులభమవుతుంది. పరిశోధన చేసిన 7.5 మిలియన్ల మందికేన్సర్ రోగుల్లో 80 వేల మందికిపైగా గుండెపోటుతోనే మరణించారు. స్త్రీ, పురుషుల్లో సమానంగా స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. "
- నికోలస్ జోర్స్కీ, పరిశోధకుడు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం.