మూడు నెలలపాటు క్వారంటైన్లో గడిపిన ఓ పిల్లికి ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. ఇప్పుడది దత్తతకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. పిల్లి ఏంటీ? దత్తత ఏంటీ? దానికి క్వారంటైన్ ఏమిటీ అనుకుంటున్నారా? అయితే చదవండి.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న చైనా నుంచి చెన్నై ఓడరేవుకు ఓ కంటైనర్ వచ్చింది. అందులో పిల్లల బొమ్మలతో పాటు ఓ నిజమైన గోధుమ రంగు ఆడ పిల్లి కూడా ఉంది. అయితే అప్పటికే చైనాలో కరోనా విజృంభిస్తోంది. దీనితో అప్రమత్తమైన చెన్నై కస్టమ్స్ అధికారులు.. ఆ పిల్లికి వైద్య పరీక్షలు చేయించి.. క్వారంటైన్లో ఉంచారు.
పిల్లి ప్రేమికుల ఆందోళన
పిల్లిని నిర్బంధంలో ఉంచడంపై జంతు ప్రేమికులు, పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏనిమల్స్) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పిల్లికి స్వేచ్ఛ ప్రసాదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చట్టసభ్యురాలు మేనకా గాంధీ, బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా సహ వ్యవస్థాపకుడు చిన్ని కృష్ణ, ది కాటిట్యూడ్ ట్రస్ట్ సహకారంతో... మూడు నెలలపాటు నిర్బంధంలో ఉన్న పిల్లిని విడుదల చేయాలని పెటా ఇండియా విజ్ఞప్తి చేసింది. దీనితో రంగంలోకి దిగిన తమిళనాడు పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ... ఆ పిల్లిని నిర్బంధం నుంచి విడిపించే ప్రక్రియను సులభతరం చేసింది.