తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2020, 9:24 AM IST

ETV Bharat / bharat

విషాద పయనం: సరిగ్గా పదేళ్ల క్రితం.. ఇలాగే!

కేరళలోని కోజీకోడ్​ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలాగే.. అచ్చం పదేళ్ల కిందట కర్ణాటకలోని మంగళూరులో ఓ ప్రమాదం జరిగింది. అక్కడ కూడా ఇదే తరహాలోనే టేబుల్​టాప్ రన్​వేపైనే ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో 158 ప్రాణాలు కోల్పోయారు.

similar flight accidents
సరిగ్గా పదేళ్ల క్రితం.. అచ్చం ఇలాగే!

కోజీకోడ్ ఘటన తరహాలోనే సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు విమానాశ్రయంలో భారీ ప్రమాదం సంభవించింది. అక్కడిలాగే ఇక్కడ కూడా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు టేబుల్‌టాప్ రన్‌వేలే ఉన్నాయి. రెండు ప్రమాదాల్లోనూ దుబాయ్ నుంచి వస్తున్న బోయింగ్-737 రకానికి చెందిన విమానాలే ధ్వంసం కావడం గమనార్హం.

కో పైలట్​ చెప్పినా..

అది.. 2012 మే 22. దుబాయ్​ నుంచి వచ్చిన ఎయిర్‌ ఎక్స్‌ప్రెస్ విమానం ఉదయం 6 గంటల ప్రాంతంలో మంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్​ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అప్పటికే విమానాన్ని దించాలా.? వద్దా.? అనే సందిగ్ధంలో ఉన్నారు పైలట్. ల్యాండింగ్ వద్దు వెనక్కి వెళ్దామని కో పైలట్.. పైలట్‌కు మూడు సార్లు చెప్పారు. అంతలోనే విమానం రన్‌వేను దాటి కొండవారగా పడిపోవడం మంటల్లో చిక్కుకోవడం జరిగిపోయాయి. ఈ ప్రమాదంలో పైలట్‌, కో-పైలట్, ఇతర సిబ్బంది సహా.. 158 మంది అగ్నికి ఆహుతయ్యారు. కేవలం 8 మంది బతికి బయటపడ్డారు.

మంగళూరు ప్రమాదమే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ చరిత్రలో మొదటి ప్రాణాంతక ప్రమాదం. అయితే.. అప్పట్లో ఇప్పుడున్నట్లు విపత్కర వాతావరణ పరిస్థితులు లేవు. వాతావరణమంతా అనుకూలంగానే ఉంది. విమానాన్ని దించడంలో పైలట్ చేసిన తప్పిదమే 2012 నాటి ఘోర ప్రమాదానికి కారణమని చివరికి తేలింది.

ఈ రన్​వేలు భిన్నం..

టేబుల్‌ టాప్ రన్‌వే..పేరుకు తగినట్లుగానే టేబుల్ ఉపరితలం మాదిరిగానే ఈ రన్‌వేలు ఉంటాయి. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ తరహా రన్‌వేను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్‌వేలకు ముందు, వెనుక.. కొండలు, లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాలలోని రన్‌వేలతో పోలిస్తే.. ఈ రన్‌వేల నిడివి కూడా చిన్నదిగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా దృష్టభ్రాంతిని, అయోమయాన్ని కలిగిస్తాయి ఈ రన్‌వేలు. పైలట్‌లు వెంట్రుకవాసి తప్పిదం చేసినా సరే విమానానికి ఘోర ప్రమాదం తప్పదు. దేశంలో ఇలాంటి టేబుల్‌టాప్ రన్‌వేలు.. మూడు (మంగళూరు, కోజీకోడ్​, మిజోరంలోని లెంగ్​వ్యూ) విమానాశ్రయాల్లో ఉన్నాయి.

అన్ని విమానాల్లా కాదు..

అన్ని రకాల విమానాలూ ఈ టేబుల్‌ టాప్ రన్‌వేలపై దిగడానికి అనుకూలం కాదు. షార్ట్ ఫీల్డ్ ఫెర్మార్మెన్స్ ఎస్​ఈపీ సాంకేతికత ఉన్న విమానాలు మాత్రమే వీటిపై దిగగలవు. పైలట్ కూడా ఈ రన్‌వేకు తగినట్లే విమానాన్ని ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ రన్‌వేలపై దించిన విధంగానే.. టేబుల్‌టాప్‌పై ల్యాండ్​ చేయాలని పైలట్ ప్రయత్నించడం కూడా మంగళూరు విమాన ప్రమాద కారణాల్లో ఒకటని తేలింది. ఈ ఇబ్బందుల వల్లనే పలు పౌర విమానయాన సంస్థలు బోయింగ్-737, ఎయిర్‌బర్ ఏ-330 వంటి విమానాలను టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్న విమానాశ్రయాలకు పంపడం మానుకున్నాయి.

ఇదీ చదవండి:కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details