పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇవి ఉపయోగించి వ్యసనపరులుగా మారుతున్నారు కొందరు. అలాంటిది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో వీటిని ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. దీన్ని ఆపాలని దిల్లీ ప్రభుత్వాధికారి ఒకరు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
డాక్టర్ ఎస్.కె.అరోరా, దిల్లీ ఆరోగ్య శాఖలో అదనపు డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు అదే రాష్ట్రంలో టోబాకో కంట్రోల్ సెల్‌ను పర్యవేక్షించేవారు. జరగబోయే అవార్డుల కార్యక్రమంలో పొగాకు సంబంధిత ఉత్పత్తులను ప్రచారం చేయడం కోప్టా యాక్ట్‌కు (పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం) వ్యతిరేకమని ఆ లేఖలో పేర్కొన్నారు.
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పలు మాధ్యమాల ద్వారా ఈ సంస్థకు ప్రచారం కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత వీటిని చూసి పక్కదారి పట్టే అవకాశముంది. దీనిపై ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే అంత మంచిది -డాక్టర్ ఎస్.కె.అరోరా
ఈనెల 13న దిల్లీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా ఐదో వన్డేలోనూ కొన్ని పొగాకు ఉత్పత్తుల సంస్థలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఇది ప్రభుత్వ చట్టాల అతిక్రమణ కిందకే వస్తుందని అరోరా తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్), క్రీడా పోటీల్లో పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్ని నిషేధించాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాల్ని కోరింది.