సాగు చట్టాలను విమర్శిస్తూ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్లను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తప్పుబట్టారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఆయన.. వారిని పక్కదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. పవార్ చేసిన కొన్ని ట్వీట్లు చట్టంలో ఉన్న వాస్తవాలను ప్రతిబింబించేలా లేవని మండిపడ్డారు. వ్యవసాయ చట్టలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్న తరువాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో పవార్ కూడా వ్యయసాయ మంత్రిగా పని చేశారన్న తోమర్... ఆ సమయంలో ఆయన కూడా ఈ రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారని గుర్తు చేశారు.
ఇటీవల సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం... కార్పొరేట్లు రైతుల నుంచి సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించవచ్చనే భయాలకు దారితీస్తాయని శరద్‌పవార్ ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన తోమర్.. పవార్‌కు బదులిచ్చారు.