పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తూ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాకు మద్దతును ఉపసంహరించుకుని తిరిగి పార్టీతో కలవాలని ఎన్సీపీ నేతలు చేస్తోన్న బుజ్జంగింపులను తిప్పికొట్టారు. తాను ఇప్పటికీ ఎన్సీపీతోనే ఉన్నానని... శరద్ పవారే తమ నాయకుడని స్పష్టం చేశారు.
ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, దిలిప్ వాల్సే పాటిల్.. ఈరోజు ఉదయం అజిత్ పవార్‌ను కలిసి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తిరిగి ఎన్సీపీతో కలవాలని సూచించారు. కానీ.. తాజాగా అజిత్ పవార్ ప్రకటనతో వారి ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.
భాజపా-ఎన్సీపీ కూటమి వచ్చే అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేసారు అజిత్ పవార్.
" నేను ఎన్సీపీలోనే ఉన్నాను.. ఎప్పటికీ ఇందులోనే ఉంటాను. శరద్ పవార్ మా నాయకుడు. మా భాజపా-ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో వచ్చే అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది. రాష్ట్రం, ప్రజల అభివృద్ధి కోసం నిబద్ధతగా పనిచేస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. చిన్న పాటి సహనం అవసరం. నాకు మద్దతు పలికిన వారందరికి కృతజ్ఞతలు"
- అజిత్ పవార్, ఉప ముఖ్యమంత్రి