దేశంలో ఓవైపు కొవిడ్ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు క్రమేపీ లాక్‌డౌన్ సడలింపులూ ఇస్తున్నారు. వాణిజ్య, రవాణా తదితర కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. రద్దీ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికివారే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీటిలో ప్రధానమైనది మాస్కులు ధరించడం. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం, వైద్య ఆరోగ్య సిబ్బంది ఎలాంటి మాస్కులు పెట్టుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వంటి అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా చేసిన సూచనలివి..
ఏ మాస్కు ఎవరికి?
మెడికల్ మాస్కులు
- కొవిడ్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వారంతా సర్జికల్, ఎన్95 వంటి మెడికల్ మాస్కులు ధరించాలి. హృద్రోగ విభాగాలు, దీర్ఘకాలిక రోగుల సంరక్షణ కేంద్రాల్లో (కొవిడ్ నిర్ధారణ కాకపోయినా..) సేవలందించేవారు కూడా పెట్టుకోవాలి.
- కొవిడ్ బారిన పడినవారూ మెడికల్ మాస్కులు ధరించాలి.
- కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉన్న ప్రాంతాల్లో 60ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు భౌతిక దూరాన్ని పాటించే వీల్లేనప్పుడు వీటిని పెట్టుకోవాలి.
సాధారణ మాస్కులు
- కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లే సామాన్య ప్రజానీకం వీటిని ధరించాలి. ఉదా: బస్సులు, రైళ్లు, ఆటోలు వంటివాటిలో ప్రయాణిస్తున్నపుడు, దుకాణాల్లోనూ, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడూ.
- వీటిలో వస్త్రం తయారుచేసిన (ఫ్యాబ్రిక్/క్లాత్) మాస్కులు పెట్టుకోవచ్చు. ఇవి బయట కొన్నా.. ఇంట్లో తయారు చేసుకున్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
- 3 పొరలు ఉండే మాస్కులే శ్రేయస్కరం.