దేశంలో కొవిడ్-19 విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఆందోళనకర స్థాయిలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాట కొద్దిరోజులుగా రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో తాజాగా 5,995 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,67,430కు చేరింది. మరో 101 మరణాలతో, మృతుల సంఖ్య 6,340కు పెరిగింది.
అయితే.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 3,07,677 మందికి మహమ్మారి నయమవగా.. 53,413 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలో మరో 7 వేలకు పైగా..
కన్నడనాట కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 7,571 మందికి వైరస్ సోకగా.. బాధితుల సంఖ్య 2,64,546కు పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 93 మంది బలవ్వగా, మొత్తం ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,522కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,76,942 మంది వైరస్ నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఉత్తర్ప్రదేశ్లో ఉగ్రరూపం..
యూపీలో కొత్తగా 4,991 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,77,239కి చేరింది. మరో 66 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 2,797కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,26,657 మందికి వైరస్ నయమవగా.. 47,785 యాక్టివ్ కేసులున్నాయి.