దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలు తమను కోరినట్లు కేంద్రం వెల్లడించింది. టీకా తయారీ కంపెనీలతో చర్చలు జరపాలని రాష్ట్రాలు సూచించినట్లు తెలిపింది. అయితే.. వ్యాక్సిన్‌ను ప్రాధాన్య క్రమంగా అందిచాలని నిర్ణయిస్తే.. వాటి సరఫరాకు వనరుల పరంగా ఎలాంటి సమస్య లేదని కేంద్రం స్పష్టం చేసింది.
మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ విధివిధానాల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం కృషి చేస్తోందని నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు వీకే పాల్ చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే సరఫరాకు ఎలాంటి సమస్యలు ఉండదని..ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పష్టత వచ్చేవరకూ వేచి చూడాలని రాష్ట్రాలను కోరినట్లు ఆయన చెప్పారు.
"వ్యాక్సిన్ అపరిమితంగా లభించకపోతే.. ప్రాధాన్యత క్రమంలో అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వ్యాక్సిన్ ఏ స్థాయిలో అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. వీటిపై చర్చలు జరుపుతున్నాం. టీకాను ప్రాధాన్యత క్రమంలో అందించేందుకు వనరుల పరంగా ఇప్పటివరకైతే ఎలాంటి సమస్య లేదు."
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు
మరోవైపు, భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్ టీకాకు ఫేజ్ 3 ట్రయల్స్ అనుమతులు లభించాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. కాడిలా సంస్థ టీకా ఫేజ్ 2 ప్రయోగాల్లో ఉన్నట్లు చెప్పారు. సీరం సంస్థ తయారు చేసిన టీకాపై ఫేజ్ 2బీ, ఫేజ్ 3 ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అమెరికా దేశాల్లో సీరం టీకా ఫేజ్ 3 ట్రయల్స్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.