దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ వల్ల అన్నిచోట్లా ప్రజా రవాణా బంద్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వలస కూలీలు ఇళ్లకు చేరుకునే ప్రత్యామ్నాయం లేక ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. రోడ్ల వెంబడి నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తూ కనిపిస్తున్నారు. వారందరికీ ఆహారం, వసతి కల్పించాలని.. అందుకు విపత్తు నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోంశాఖ.
కోవిడ్ 19 ప్రభావం నేపథ్యంలో వలస కూలీలకు తాత్కాలికంగా వసతి కల్పించి, ఆహారం, బట్టలు అందించాలని, అవసరమైన వైద్య సదుపాయాలూ సమకూర్చాలని చెప్పింది. రాష్ట్ర విపత్తు నిధులను వినియోగించుకునే విషయంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అదనంగా ఈ సూచనలు కూడా అమలు చేయాలని పేర్కొంది.
రైతులకూ సామాజిక దూరమే...
రబీ సాగు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రైతులూ, వ్యవసాయ కూలీలు సామాజిక దూరం పాటించాలని సూచించింది భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల వాడకంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.
పంటలు, కోళ్లు, మత్స్య పరిశ్రమలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా.. కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే), ఐసీఏఆర్ పరిశోధనా కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలను సంప్రదించి, వారి సూచనలు పాటించాలని చెప్పింది. ఇప్పటికే రైతులు, వ్యవసాయ కూలీలు, మండీలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సంస్థలకు లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు నిచ్చింది.
వీరితో పాటు ఎరువులు, క్రిమి సంహారక మందుల తయారీ సంస్థలు, విత్తనాల శుద్ధి, ప్యాకింగ్ వంటి కంపెనీలకు లాక్‌డౌన్ నుంచి ఊరటనిచ్చింది. వ్యవసాయ యంత్రాలనూ ఇతర ప్రాంతాల తరలించేందుకు లాక్‌డౌన్ నిబంధనల్లో మినహాయింపులు ఇచ్చింది.
జైళ్లలో శుభ్రత పాటించాలి...
జైళ్లలో ఖైదీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం. పరిశుభ్రతను పక్కాగా అమలు చేయాలని... ఖైదీల మధ్య సామాజిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారిస్తున్నందున.. జైళ్లలోనూ ఆ ఏర్పాట్లు చేయాలని చెప్పింది.