ప్రకృతి అందాలతో భారత్‌కు మకుటంలా నిలిచి మిరిమిట్లు గొలిపే కశ్మీర్.. పర్యటకుల రాకతో మురిసింది. నూతన సంవత్సరం సందర్భంగా ఓ చక్కని అనుభూతిని తమ మనస్సుల్లో నింపుకునేందుకు సందర్శకులు కశ్మీర్లో అడుగుపెట్టారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కశ్మీర్‌ను పలకరించేందుకు రావడం వల్ల శ్వేతవర్ణంతో నిండిన ఆ ప్రాంతానికి పునర్వైభవం వచ్చినట్టు అయింది.
అప్పటి నుంచి..
2019లో ఆర్టికల్ 370 రద్దు, గతేడాది విధించిన లాక్డౌన్.. పర్యటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం కారణంగా కార్యకలాపాలు పుంజుకున్నాయి. మళ్లీ కశ్మీర్ అందాలపై సందర్శకులు చూపిస్తున్న ఆసక్తితో.. ఆ రంగంపై ఆధారపడిన వారిలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. పర్యటకుల రాక పట్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సరికొత్తగా స్వాగతం..
మహారాష్ట్రకు చెందిన తొలి బృందాన్ని దాల్ సరస్సు హౌస్‌బోట్ నిర్వాహకులు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతించారు. ఈ క్షణం తమకు పండుగతో సమానమని ఓ వ్యాపారి అన్నాడు.
"ఆర్టికల్ 370 రద్దు తర్వాత మా హౌస్ బోట్‌కు తొలిసారి పర్యటకులు వస్తున్నారు. ఇది మాకు అతిపెద్ద పండుగ. మా వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయి."