అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆగస్టు 5న ప్రారంభమవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మందిర పునర్నిర్మాణం విలువలకు గుడి కట్టడం లాంటిదని అభివర్ణించారు. రామాయణంలోని ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఆ సందేశం ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చారు.
"మరో రెండు రోజుల్లో మన మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రక ఘట్టం మన కళ్ల ముందు ఆవిష్కారం కాబోతుంది. కనీసం 2వేల సంవత్సరాల క్రితం రచించిన, మన సామూహిక చేతనలో భాగమై అమర కావ్యంగా ప్రసిద్ధి గాంచిన రామాయణంతో మనకున్న అనుబంధం ప్రతిఫలించబోతుంది. శ్రీరాముడు మనకు ఆదర్శవంతమైన, అసాధారణమైన, కోట్లాది మంది దేవుడుగా ఆరాధించే ఒక మహాపురుషుడు. అంతేకాదు, ఒక న్యాయపూరితమైన, బాధ్యతాయుతమైన సామాజిక వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు విలువలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానుభావుడు. ఆ రాముడికోసం మనం ఒక దేవాలయాన్ని నిర్మించడం రోమాంచితంగా, మన జీవితాలు ధన్యమైనట్లుగా అనిపించడంలో ఆశ్చర్యమేముంది? ఇవాళ గత వైభవం మన కళ్లముందే ఒక మహాద్భుతంగా ప్రత్యక్షం కాబోతుంది. మనం కలలు కంటున్న ఆకాంక్షలు సజీవం రూపం దాల్చబోతున్నాయి. నిజంగా ఈ ఘట్టం మనలో అప్రయత్నంగా ఉత్సవ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మనం రామాయణ సారాన్ని సరైన దృక్పథంతో అవగాహన చేసుకుంటే, ధర్మం పట్ల, నైతిక వర్తన పట్ల విశిష్టమైన భారతీయ దృక్పథాన్ని ఒడిసిపట్టుకున్న ఒక కావ్యంగా మనం అవలోకిస్తే, ఇదొక సాధారణ పరిణామంగా అనిపించదు. మొత్తం సమాజంలో ఒక నవనవోన్మేషమైన ఆధ్యాత్మిక ఉత్తేజానికి దారితీసే పరిణామమని మనకు అర్థం అవుతుంది. రామాయణం ఒక విశ్వజనీన దృష్టిని ప్రసరించే మహాకావ్యం కాబట్టే అది ఆగ్నేయాసియా లో అనేక దేశాల సంస్కృతిపై బలమైన ప్రభావాన్ని చూపింది.
వేద పారంగతుడు, సంస్కృత పండితుడు అయిన ఆర్థర్ ఆంథోనీ మెక్ డోనెల్ ప్రకారం భారతీయ ప్రతుల్లో వర్ణించిన శ్రీరాముడి ఆదర్శాలు మౌలికంగా లౌకికమైనవి. గత రెండున్నర సహస్రాలుగా ప్రజల జీవితాలు, ఆలోచనలపై అవి ప్రగాఢ ప్రభావాన్ని చూపుతున్నాయి. భారత దేశంలోనే కాదు, ఆగ్నేయాసియాలో జావా, బాలి, మలయా, బర్మా, థాయిలాండ్, కంబోడియా, లావోస్ మొదలైన అనేక దేశాల్లో రామాయణం ఎందరో కవులు, నాటక రచయితలు, నృత్యకళాకారులు, సంగీతకారులు, జానపద కళాకారులను ఆకట్టుకుంది.