సీనియర్ నేతల పట్ల భాజపా తీరు విచారకరమని మమత బెనర్జీ విమర్శలు భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బంగాల్ సీఎం మమతా బెనర్జీ. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిల పట్ల భాజపా తీరు సరిగా లేదని విచారం వ్యక్తం చేశారు. అడ్వాణీతో ఫోన్లో సంభాషించి.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిపారు. "ఈ రోజు ఉదయం అడ్వాణితో మాట్లాడాను. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశా. కుషలంగానే ఉన్నానని చెప్పారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల పట్ల భాజపా తీరు నిజంగా విచారకరం. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు." - మమత బెనర్జీ, పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి.
లోక్సభ ఎన్నికల్లో పోటీకి అడ్వాణీ, జోషిలకు టికెట్లు కేటాయించలేదు భాజపా. ఈ నేపథ్యంలో విమర్శలు చేశారు దీదీ.
నిజమైన కాపలాదార్లంటే గౌరవం
'నేను కూడా కాపలాదారునే' ప్రచారాన్ని పేర్కొంటూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు దీదీ. తనకు నిజమైన కాపలాదారుల పట్ల అపార గౌరవం ఉందని, కానీ రాజకీయ లబ్ధికోరుకునే కాపలాదారుల పట్ల కాదని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తల విజయాన్ని రాజకీయంగా లబ్ధిపొందడానికి మోదీ వాడుకుంటున్నారని ఆరోపించారు మమతా బెనర్జీ.
మోదీ ఎప్పుడైనా అంతరిక్షంలోకి వెళ్లారా లేదా ఏదైన పరిశోధన చేశారా? అంటూ ప్రశ్నించారు. కేవలం రాజకీయంగా లబ్ధిపొందడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.