ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీజీ) చట్టాన్ని గత ప్రభుత్వాలు నీరుగార్చాయని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చట్టంలోని ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరించేందుకే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్పీజీ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిందని ఉద్ఘాటించారు.
ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. దేశాధినేతల కోసం ఉద్దేశించిన చట్టాన్ని సవరించి... మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కుటుంబ సభ్యులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని ఎస్పీజీ పరిధిలోకి తీసుకొచ్చారని ఆరోపించారు.
" ప్రధానమంత్రి రక్షణపై కార్యాచరణ ప్రణాళిక కోసం 1985లో బీర్బల్‌నాథ్ కమిటీ ఏర్పాటు చేశారు. 1988లో ఒక చట్టం తెచ్చారు. ఈ చట్టానికి లోబడి ప్రధాని, ఆయన కుటుంబ రక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీజీ) పనిచేస్తోంది. ఈ చట్టాన్ని 1991, 94లో సవరించారు. 1999, 2003లోనూ సవరణలు చేశారు. ఇవి చట్టాన్ని నీరుగార్చాయి. చట్టంలోని ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరించేందుకు ఇప్పుడు మేము మరోమారు సవరణతో వచ్చాం."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.