రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌లో 'లేఖ' వ్యవహారంపై అంతర్గత యుద్ధం జరిగిన కొద్ది రోజులకే.. దీనిపై ఊహాగానాలు జోరందుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రాజ్యసభలో ఆజాద్ పదవీకాలం 2021 ఫిబ్రవరి 15తో ముగియనుంది. పెద్దల సభకు ఆజాద్ మరోమారు ఎన్నికవ్వడం దాదాపు అసాధ్యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే పుదుచ్చెరిలో సీటు మాత్రమే ఆజాద్‌కు ఉన్న ఏకైక అవకాశంగా కనపడుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎంపీ ఎన్ గోపాలకృష్ణన్ ఉన్న ఆ స్థానం 2021అక్టోబర్‌లో ఖాళీ కానుంది. ఇందులోను ఇంకో చిక్కు ఉంది. వచ్చే ఏడాది మేలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో గెలిచి కాంగ్రెస్ తిరిగి అధికారం చేపడితేనే ఆ సీటు ఆజాద్‌ను వరిస్తుంది.
ఇదీ చూడండి:-'కాంగ్రెస్ వాదులైతే లేఖను స్వాగతిస్తారు'
ఇది జరగకపోతే.. 2022మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల వరకు ఆజాద్ పెద్దల సభ మెట్లు ఎక్కలేకపోవచ్చు.
జమ్ముకశ్మీర్‌లో ఈసారి కష్టమే...!
జమ్ముకశ్మీర్ నుంచి ఆజాద్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో కేంద్రం జమ్ముకశ్మీర్‌ను కేంద్ర పాలితప్రాంతంగా విభజించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీనిచ్చారు. కానీ 2021మార్చి వరకు అది సాధ్యపడేలా కనపడటం లేదు.
2015లో నేషనల్ కాన్ఫరెన్స్ చట్టసభ్యుల మద్దతుతో పెద్దల సభకు చేరారు ఆజాద్. కానీ ఈసారి వారి నుంచి మద్దతు లభించడం ప్రశ్నార్థకమే.