తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చూపులేని చాయ్​వాలా... స్ఫూర్తి నింపడంలో తౌజెండ్​వాలా - tea selling in kashmir

కళ్లు లేని వాళ్లు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. వేగంగా కదిలే లోకంతో పోరాడలేక.. కొందరు ఆత్మన్యూనతా భావంతో జీవనం సాగిస్తుంటారు. అయితే సమస్యకే సవాలు విసిరి ఆత్మగౌరవంతో బతికి చూపిస్తున్నాడు ఆ వ్యక్తి. చూపు లేకున్నా.. గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.

chaiwala
చూపులేని చాయ్​వాలా... స్ఫూర్తి నింపడంలో తౌజెండ్​వాలా

By

Published : Feb 23, 2020, 11:05 AM IST

Updated : Mar 2, 2020, 6:53 AM IST

చూపులేని చాయ్​వాలా... స్ఫూర్తి నింపడంలో తౌజెండ్​వాలా

మనకు ఏదైనా సమయానికి సమకూరకపోతే హైరానా పడిపోతుంటాం. కావాల్సిన వస్తువు కళ్లముందే కనిపిస్తున్నా తొందరలో ఎక్కడెక్కడో వెతుకుతూ ఇంట్లో వాళ్లమీద అరుస్తుంటాం. అదే దృష్టిలోపం ఉంటే.. ఒకసారి ఊహించుకోండి. జీవితం ఎంత నరకప్రాయమో అనిపిస్తుంది కదూ. కానీ తనలోని లోపాన్ని జయించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ వ్యక్తి.

కశ్మీర్​ శ్రీనగర్​ చెందిన మహ్మద్ షఫీ లోనీ.. నాలుగో తరగతిలో కంటిచూపును కోల్పోయాడు. అయితే అతడికున్న దృష్టిలోపం ఎంతమాత్రమూ తనని గౌరవప్రదమైన జీవనం సాగించకుండా నియంత్రించలేకపోయింది. తన జీవనం సాగించేందుకు కోన్మోహ్​ పారిశ్రామిక వాడ వద్ద టీ అమ్మడం ప్రారంభించాడు లోనీ.

"కంటి చూపు కోల్పోయాను. కానీ ధైర్యం కోల్పోలేదు. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆరు నెలల తర్వాత కంటిచూపు కోల్పోయానని అర్థమైంది. కంటి చూపు కోసం చాలా ప్రయత్నించాను. అనేకమంది వైద్యుల వద్దకు వెళ్లాను కానీ ఫలితం లేకపోయింది. నాకాళ్లపై నేను నిలబడాలని అనుకున్నాను. చాయ్ అమ్మడం మొదలుపెట్టాను. అనంతరం పెళ్లి చేసుకున్నాను. దృష్టిలేని కారణంగా అంచనాతో పనిచేస్తాను. డబ్బుల విషయంలో ఇది వంద, ఐదు వందలు అని అర్థం అవుతాయి. కానీ మరీ సమస్యగా ఉన్నప్పుడు పక్కనున్నవారి సహాయం తీసుకుంటాను."

-మహ్మద్ షఫీ లోనీ

ఎవరిపై ఆధారపడకుండా జీవించాలనే తపనే తనను నిలబెట్టిందన్నాడు లోనీ. ఈ స్ఫూర్తే ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ పథకాల ఆధారంగా కాక సాధికారిక జీవనం సాగించేలా చేసిందని చెప్పాడు.

"మనుషుల్లో ఏదైనా సాధించాలనే తపన ఉండాలి. ఏదో ఒకటి చేయాలని అనుకోవాలి. పెద్దగా ఆదాయం ఆర్జించకపోయినా ఫర్వాలేదు. రోజుకు ఐదు వందలు సంపాదించినా చాలు. ఇల్లు గడుస్తుంది. మన కాళ్లపై మనం నిలబడాలి."

-మహ్మద్ షఫీ లోనీ

లోనీకి నలుగురు పిల్లలు. ముగ్గురు మగ, ఒక ఆడ సంతానం. పెద్దవాళ్లిద్దరికీ త్వరలో వివాహాలు జరగనున్నాయని తన సంతోషాన్ని పంచుకున్నాడు లోనీ.

ఇదీ చూడండి:కుటుంబ సభ్యులతో నిర్భయ దోషుల చివరి కలయిక!

Last Updated : Mar 2, 2020, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details