రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా.. సాహిత్య అభిరుచిని మాత్రం పీవీ వీడలేదు. న్యాయశాస్త్ర పుస్తకాలే కాదు కాల్పనిక సాహిత్యం చదవటంపైనా ఆసక్తి చూపేవారు. పీవీకి చిన్నప్పటి నుంచి సాహిత్యాభిలాష ఉండేది. ఆ అభిరుచే ఆయనను రచయితగా మార్చింది. బాల్యం నుంచే భావావేశం ఎక్కువ. ఈ క్రమంలోనే వరంగల్ నుంచి కాకతీయ అనే పత్రిక నిర్వహించారు. అందులో స్వయంగా ఎన్నో వ్యాసాలు రాశారు. విమర్శలు, కథలు, కవితలు అందించారు.
విద్యార్థి దశ నుంచే రచన వ్యాసాంగం చేపట్టారు పీవీ. కథలు, కథానికలు, నవలలు, అనువాద గ్రంథాలు, ఎన్నింటినో రచించారు. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో పీవీ రాసిన 'గొల్ల రామవ్వ' కథ విజయ కలం పేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. 1995లో 'విస్మృత కథ' సంకలనంలో ఈ కథ ప్రచురించాక ఇది పీవీ రచనగా అందరికీ తెలిసింది.
రాజీవ్ గాంధీ పాలనను విమర్శిస్తూ..
ఇవేకాక మరెన్నో వ్యాసాలు విజయ కలం పేరుతో రాశారు. కాంగ్రెస్ వాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించారు. 1995లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది.
'ది ఇన్‌సైడర్' పేరుతో ఆత్మకథ
తన ఆత్మకథను 'ది ఇన్‌సైడర్' పేరుతో రాసుకున్నారు పీవీ. అది ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది. ఇతర భాషల్లోనూ ఈ రచన అనువాదానికి ప్రశంసలు దక్కాయి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు పుస్తకాన్ని 'సహస్రఫణ్' హిందీలోకి అనువదించి ప్రశంసలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునూ అందుకున్నారు. మరాఠి రచయిత హరి నారాయణ్ రచించిన "పన్ లక్షత్ కోన్ ఘతో' నవలను 'అబల జీవితం' పేరిట తెలుగులోకి అనువదించారు. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి జయప్రభ కవిత్వాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు పీవీ. 'మంగయ్య అదృష్టం' అనే నవలిక మంత్రిగారు, ఎదవ నాగన్న అనే కథలు రచించారు.
ఆంగ్లంలో 'బ్లూ సిల్క్ శారీ' అనే కథ రచించారు. కాళోజీ షష్టిపూర్తి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక గేయం రాశారు. వేయి పడగలపై పండిత ప్రశంసల పేరుతో వ్యాఖ్యానం రాశారు. కంప్యూటర్ ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవారు. ఆయన చాలా వరకు రచనలను తానే కంప్యూటర్‌లో టైప్ చేసి ఉంచే వారని ఆయన సన్నిహితులు కొందరు చెబుతారు. పీవీ బహుభాషాకోవిదుడు. మొత్తం 17 భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. కోబాల్, బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్‌లోనూ నైపుణ్యం గడించారు.
80 ఏళ్ల వయసులోనూ అనువాద ప్రక్రియపై మక్కువ చూపటం పీవీలోని కార్యదీక్షతకు, సాహితీ అభిలాషకు నిదర్శనం. సాహితీ వ్యక్తీకరణపై బలమైన అభిప్రాయాలున్న ఆయన కవి శైలిని అతిక్రమించకుండానే ఆ రచన అనువదించేందుకు కృషి చేయాలని చెప్పేవారు పీవీ.
ఇదీ చూడండి:వంగర- దిల్లీ: 'పీవీ' రాజకీయ ప్రస్థానం ఘనం