స్వతంత్ర భారతావనిలో జాతిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. ఆయన అసమాన విద్యావంతుడు. రాజనీతి కోవిదుడు. న్యాయశాస్త్ర దిట్ట. గొప్ప ఆర్థికవేత్త. కోట్ల మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. దేశ సార్వభౌమాధిపత్యానికి, సమగ్రతకు, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి అహరహం పరితపించారు. ఆయన సారథ్యంలో రూపుదిద్దుకున్న మహోన్నత రాజ్యాంగం మనల్ని ఏడు దశాబ్దాలుగా నడిపిస్తోంది. అంటరానితనాన్ని నిషేధించి... ఊరూరా నిలువెత్తు విగ్రహమై నిలిచిన ఆ మహోన్నత మూర్తి... ఒక చేతిలో పుస్తకాన్ని, మరో చేతి చూపుడు వేలితో ప్రతి ఒక్కరికీ దారి చూపిస్తున్నారు.
ఆలోచన శక్తి... వాదనా పటిమ... ఒప్పించే నేర్పు
భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను, 7ఉప కమిటీలను ఏర్పాటుచేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా(డ్రాఫ్టింగ్) కమిటీని 1947, ఆగస్టు 29న డా.బి.ఆర్.అంబేడ్కర్ అధ్యక్షుడిగా, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. భిన్న భౌగోళిక పరిస్థితులు, జాతులు, మతాలతో వైవిధ్యంగా ఉన్న దేశానికి చక్కటి దిశానిర్దేశం చేయడానికి ఎలాంటి రాజ్యాంగం కావాలనే విషయంపై అంబేడ్కర్‌కు స్పష్టత ఉందని స్వయంగా గాంధీజీ నమ్మేవారు. ఈ కారణంగానే రాజ్యాంగ పరిషత్‌లో కాంగ్రెస్‌దే ఆధిపత్యమున్నా సభ్యులంతా... అప్పటికే న్యాయశాఖ మంత్రిగా ఉన్న ఆయన పేరును ముక్తకంఠంతో సూచించారు. రాజ్యాంగ పరిషత్ 11సార్లు సమావేశమైంది. కమిటీల సభ్యులంతా లిఖిత, మౌఖిక రూపంలో ఇచ్చిన సూచనలను ముసాయిదా కమిటీ నమోదు చేసుకునేది. వాటిని క్రోడీకరించిన తర్వాత రాజ్యాంగ పరిషత్‌లో చర్చకు పెట్టేది. రాజ్యాంగ పరిషత్ ఏ అంశాన్నీ ఓటింగ్ ద్వారా ఆమోదించలేదు. ప్రతీ ప్రతిపాదన, సమస్యపై సుదీర్ఘంగా చర్చించి, సర్దుబాటు చేసి, సమన్వయం, ఏకాభిప్రాయం ద్వారా పరిష్కరించిన తర్వాతే ఆమోదించారు. ఈ ప్రక్రియ ముసాయిదా కమిటీ పనిని భారీగా పెంచింది. ముసాయిదా ప్రతి తయారీలో భాగంగా అంబేడ్కర్ స్వయంగా 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివారు. మొత్తంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టించి, సుదీర్ఘ మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ, ఆంగ్లంలో రెండు ప్రతులను తయారుచేసింది. దీని వెనుక అంబేడ్కర్ అవిరళ కృషి ఉంది. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో 115 రోజులు చర్చించి, 2473 సవరణలతో రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదించారు.