కాలగమనంలో ఏడాదంటే తక్కువేమీ కాదు. ఏడాదంటే ఎన్నో మైలురాళ్లుంటాయి. విషాదం మిగిల్చిన ఘటనలుంటాయి. మరచిపోలేని మధుర స్మృతులూ ఉంటాయి. అలానే 2020 ఎన్నో చేసింది.. ఎన్నో చూపింది. కొందరికి మోదం మిగిల్చితే, మరి కొందరికి ఖేదాన్నిచ్చింది. ఏదేమైనా నిష్క్రమిస్తోన్న పాత సంవత్సరం గత సంవత్సరంగా కాలం ఖాతాలో వేసుకునే వేళయింది.
నూతన సంవత్సరం.. ఆలోచనకూ, ఆచరణకూ సంధికాలం. కొత్త సంవత్సరం అంటే కొత్త సంకల్పం తీసుకునే రోజు.
శత సహస్ర తంత్రులు మీటిన నవోత్సాహం. వరవీణలు మోగి, శుభసంకల్పాలకు మొగ్గతొడిగి నవపథానికి అడుగులు వేస్తూ, ఉత్తేజంతో ముందుకుసాగేందుకు పూనిక ఈ విశ్వవేడుక. చీకటి వెలుగుల దోబూచుల కేళి.. రంగేళి. ఉషోదయానికి, నవోదయానికి ఎదురుచూస్తున్నాం.
అంతా ఒక్కటే..
భూగోళంలో ఖండఖండాలలో ఎన్ని వైవిధ్యాలున్నా, వైరుధ్యాలున్నా దేశదేశాలు ఒక్కటే. మనుషులంతా ఒక్కటే. ప్రవహించే రక్తం ఒక్కటే. ఉమ్మడి శత్రువును తుదముట్టించాలని ఉక్కుసంకల్పం తీసుకున్నాం. కసిని కృషిగా మలుచుకొన్నాం. పుణికిన చైతన్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ విశ్వవేడుకలు.. విశ్వమంతా పండుగకు వేదికలు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఒక మంచిపనికి పూనిక వహించి, సదాశయ సిద్ధికి సంకల్పంతో ముందుకు నడిస్తే చీకటే మాసిపోతుంది. లోకమే మారిపోతుంది.
కత్తుల వంతెనలు కుదరవిక..
కోటి ఆశలతో ముందుకు సాగే వేళ. ఆశయ సాఫల్యానికి సంకల్పం తీసుకునే శుభ వేళ. పరుగెత్తేది కాలమా? పరుగెత్తించేది కాలమా? రెండూ నిజమే. 2020లా కాలానికి కత్తుల వంతెనలు కుదరవిక. టీకా వచ్చేస్తోంది..కొవిడ్ మహమ్మారి ఆటలు ఇకసాగవంటూ నిఖిలలోకం ఒక్కటైంది. ఏది ఎలా ఉన్నా కరోనా, లాక్డౌన్లు ప్రజల జీవన శైలిని, జీవన గమనాన్ని ఎంతో మార్చేశాయి.. సంక్షోభంలోనే అవకాశాలు లభించాయి. ఆవిష్కారాలు అనేకం వచ్చేశాయి. అద్భుతాలూ చోటు చేసుకున్నాయి. 2021 నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిద్దాం. ఆహ్లాదంగా ఆహ్వానం పలుకుదాం.
కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. శుభాలు జరగాలన్న కోరిక. సమస్యలు సమసిపోవాలన్న ఆకాంక్ష. అదృష్టం వరించ వచ్చన్న ఆశ. లక్ష్యం సాధిస్తామన్న ధీమా. నూతన సంవత్సరం వస్తుందంటే ఆశలు రెక్కలు కట్టుకుని మనసంతా విహరిస్తుంది.
కానీ కరోనా నేర్పింది కేవలం పాఠాలే కాదు.. గుణపాఠాలు కూడా. అవేంటో చూద్దాం.
విరుచుకుపడిన కరోనా..
రాజ్యాలు అభివృద్ధి గణాంకాలు రాసుకుంటున్న సమయం అది. దేశాల మధ్య వాణిజ్య బంధాలు బలపడి.. సహృద్భావాలు వెల్లివిరుస్తున్న వేళ.. అది. అప్పుడు హఠాత్తుగా ఉమ్మడి శత్రువులా విరుచుకుపడింది కరోనా.
భూమండలానికే భస్మాసుర హస్తంలా మారింది. మోహరించే సైన్యాలతో పోరాడవచ్చు. కానీ కంటికి కనపడని నరహంతక శత్రువు కరోనాతో ఎలా పోరాడాలి? ప్రపంచం తలలు పట్టుకుంది.
కొవిడ్ మహమ్మారి నిరోధ వ్యాప్తికి భారత్ ముందుగా అప్రమత్తమై లాక్ డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తర్వాత నెలలపాటు పొడిగించారు. అత్యవసర సేవలనూ ఆంక్షలతో అనుమతించారు. గ్రామాల నుంచి వచ్చిన కార్మికుల వలస అప్పుడు ఉద్ధృతమైంది.
ఊహించని వేదన..
2020 అంటే ఆకర్షణీయమైన అంకెలు. నిజంగా 2020 సంవత్సరం 2020 క్రికెట్ అంత ఆనందంగా. ఆస్వాదయోగ్యంగా ఉంటుందని భావించాం. కానీ మోదానికి బదులు ఖేదాన్ని పంచింది. కొవిడ్ మృత్యుఘంటికలు మోగిస్తుంటే అగ్రరాజ్యాలే అతలాకుతలమయ్యాయి. అనేక దేశాలు.. దేశాల సరిహద్దులు మూసేశాయి. భూగోళం బిగుసుకుపోయిన భయ విహ్వల అయింది. ఇల్లే పదిలమని, స్వీయ నిర్బంధంలో ఉండి కంటికి కనపడని రాక్షసునితో విజయం తథ్యమని విశ్వసించాం. నిశ్శబ్ద సంగ్రామంలో దాదాపు విజయం అంచుకు చేరుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో రానున్న టీకాలతో, మరిన్ని ఔషధ ఆవిష్కారాలతో అందరికీ ఆరోగ్యభాగ్యం సమకూరుతుందన్న విశ్వాసం బలపడింది.
కరోనాను మనం తుదముట్టించే సమరంలో.. గత పది నెలలుగా దేశంలో ప్రజాజీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. సంక్షోభం కొన్నింటికి పరిష్కారం సూచించింది. మరోవైపు కొత్త అవకాశాలను సృష్టించింది. అవును.. సంక్షోభం నుంచే పరిష్కారం పుడుతుంది. ఆపత్కాలంలోనే ఆలోచనలు చిగురులు వేస్తాయి. అవకాశాలు లభిస్తాయి.
కొవిడ్ వల్ల దేశంలో లావాదేవీలు, చెల్లింపులు అత్యధికంగా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులలో భారత్ ఎంతో ముందుకు వెళ్లిందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం ప్రశంసించారు.
ఆన్లైన్ క్లాసులు..
విద్యారంగంలో పెనుమార్పులు వచ్చాయి. విద్యార్థులు సాంకేతికతతో స్నేహం చేశారు. ఉపాధ్యాయుల సమక్షంలో, తరగతి గదిలోనే విద్యార్థి బుద్ధివికాసం సాధ్యమని విశ్వసించాం. విద్యార్థులకు పాఠాలు అంటే నేరుగా ఉపాధ్యాయులు చెబితేనే పాఠాలు అని భావించాం. కానీ కొవిడ్ ముప్పుతో.. విద్యాసంస్థలు నెలల పాటు తెరుచుకోలేదు. ఆన్లైన్ బోధన ప్రారంభమైంది. పాఠశాలలు లేవు. బిడ్డల భవిష్యత్తు ఎలా? అని తల్లిదండ్రులు కొంత బాధపడినా, కొవిడ్ బారినపడటం కంటే ఇంట్లో ఉండి చదివే ఆన్లైన్ విద్యే మేలని తలచారు. మొబైల్ ఫోను, టీవీ ఉంటే ఎక్కడైనా పాఠాలు నేర్చుకోవచ్చని తెలియజెప్పిన సంవత్సరం 2020. పార్టీలే కాదు, విద్యాగోష్టులు, ఆధ్యాత్మిక సమావేశాలు, ఏ సమావేశాలైనా వెబ్‌లోనే. వెబినార్లతో అనుసంధానం కావటం పెరిగింది.
కరోనా తెచ్చిన మార్పులు
- కరోనా తెచ్చిన మార్పులను అవలోకిస్తే... అందరూ ఇంటికే పరిమితమైన వేళ ఆత్మీయతలు వెల్లివిరిశాయి. మానవ సంబంధాలు బలపడ్డాయి. ఇంటిపనులు, వంటపనుల్లో పురుషులూ చేయి కలిపారు.
- వెబినార్లలో దృశ్య, శ్రవణ సమ్మేళనంతో చర్చలు జరిగాయి.
- డిజిటల్ ఎకానమీ దిశగా దేశం అడుగులు వేసింది.
- కుటుంబ బంధాలు, విలువలను పదిలపర్చింది. చిన్ననాటి రోజులను తిరిగి తెచ్చింది.
- ప్రజా రవాణా నిలిచిపోవటం వల్ల ప్రజలు వాహనాల కొనుగోళ్లు ప్రారంభించారు. సెకెండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ పెరిగింది.
- బయటి ఆహారం కంటే ఇంట్లో వండిపెట్టిన ఆహారం తిని ఆరోగ్యంగా తయారయ్యారు. బర్గర్లు, పీజాలు లేవు.
- చిన్నప్పటి ఆటలు, టీవీలో మళ్లీ రామాయణ భారతాలు.
- కాలుష్యం తగ్గింది. వాయు, జల కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇంట్లోనే వ్యాయామం. పర్యావరణానికి మేలు జరిగింది.
- డబుల్ డెక్కర్ విమానాలు వచ్చాయి. భౌతిక దూరం పాటించడం అనివార్యం కావటం వల్ల కార్యాలయాలు, బస్సులు, రైళ్లలో అందుకు అనుగుణంగా కూర్చునే సదుపాయాలు వచ్చాయి.
- శుచి, శుభ్రతకు ప్రాధాన్యం లభిస్తోంది. రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు సుగంధ ద్రవ్యాల్లో పసుపు, మిరియాలు, వాము, శొంఠి, జీలకర్ర వాడకం పెరిగింది. గ్రీన్ టీ, వేడినీరు, కషాయాల వినియోగం పెరిగింది.
- టోల్ ప్లాజాల దగ్గర ఆగనవసరం లేకుండా ఫాస్టాగ్‌ల వినియోగం పెరిగింది. సినిమాల విడుదలకు ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వెబ్ సిరీస్ వచ్చాయి.
వైద్య ఆరోగ్యరంగం
కొవిడ్ సంక్షోభం మన వైద్యఆరోగ్య వ్యవస్థ పనితీరుకే పరీక్షపెట్టింది. మార్పులకు అవకాశమిచ్చింది. రోగులు వైద్యులను సంప్రదించటానికి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. నేరుగా వెళ్లి కలసి వైద్యసలహాలు తీసుకునే పద్ధతి తాత్కాలికంగా కనుమరుగైంది. కరోనా ఉద్ధృతమైన తొలి రోజుల్లో కొవిడ్ ఆస్పత్రులు కిటకిటలాడాయి. మూడు నెలలుగా కొవిడ్ ఆస్పత్రులలో పడకలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. అంటే కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే రోగులు అప్రమత్తమై వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించారు. రోగనిరోధక శక్తిపెరిగే ఆహారం తీసుకొని జాగ్రత్త పడ్డారు. ఆరోగ్య పరిరక్షణ స్పృహ పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకొని ప్రాణాలు కాపాడుకున్నారు.
కొవిడ్ సంక్షోభం ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అవకాశంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు మెరుగయ్యాయి. ఆక్సిజన్ అందించే సదుపాయాలతో పడకలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఉండే తేలికభావం పోయింది.
ఆర్థిక వ్యవస్థకు ఆత్మనిర్భరం
లాక్డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పెనుసంక్షోభం దిశగా పయనించింది. నష్టాలతో వివిధ రంగాల ఉనినికే ముప్పు ఏర్పడింది. దేశ భద్రత ఎంత ముఖ్యమో, ఆర్థిక భద్రత అంతే ముఖ్యం. ఉద్దీపనలు, ఉపశమనాలు, ఆత్మనిర్భర్ చర్యలతో ఆత్మవిశ్వాసం కల్పించింది కేంద్రం.
ఈ నేపథ్యంలో ఆర్థికానికి ఆసరాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ఆత్మ నిర్భర్ భారత్' అభియాన్ ప్యాకేజీని ప్రకటించారు.
ఇందులో భాగంగా 20,97,0.53 కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపనలు అందజేస్తామని ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను ఐదుదశలలో అమలు చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అత్యంత దారుణంగా నష్టపోయిన రంగాలు మనుగడ సాగించేందుకు కేంద్రం రుణ సహకారం అందించింది.
ప్రపంచంలో కరోనా అత్యంత దారుణంగా దెబ్బతీసిన ఆర్థిక వ్యవస్థ భారత్‌దే. ఆర్థిక మాంద్యం రోజుల్లో కూడా మనదేశం ఇంతగా నష్టపోలేదు. కొవిడ్-19 వల్ల దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధులు కోల్పోయారు. కేవలం తొలి 21 రోజుల లాక్ డౌన్ వల్లనే ఆర్థిక వ్యవస్థకు 32 వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంటే $4.5 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
లాక్డౌన్ వల్ల మార్కెట్ స్థిరత్వం లేకపోవటంతో దేశ వృద్ధి రేటు 2020 నాలుగో త్రైమాసికానికి 3.1 శాతానికి పడిపోయినట్లు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ సలహాదారు ప్రకటించారు. 2020-21 మొదటి త్రైమాసికంలో జీడీపీ ఆందోళనకరంగా -24 శాతానికి తగ్గిపోయింది. పర్యటక, ఆతిథ్య రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. వ్యాపార రంగం భారీ నష్టాలు చవిచూసింది. వ్యాపార రంగానికి 53 శాతం నష్టం వాటిల్లింది.
డిజిటల్ చెల్లింపులు పెరిగాయి..
మరో వైపు కొవిడ్ ప్రభావంతో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. బిల్‌గేట్స్.. భారత్ నగదు బదిలీ విధానాన్ని ప్రశంసించారు. సింగపూర్ ఫిన్ టెక్ సదస్సులో భారత్‌ను మెచ్చుకున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా నగదు బదిలీ చేసే యూపీఐ విధానం విశిష్టమైందని కితాబునిచ్చారు. యూపీఐ విధానం కొవిడ్ కాలంలో ఎంతో బాగా ఉపయోగపడిందన్నారు. నూతన ఆవిష్కరణల గురించి వెదకాలంటే ఇక ప్రపంచం చైనా వైపు కాకుండా భారత్ వైపు చూడాలని బిల్ గేట్స్ అన్నారు.
చిత్రపరిశ్రమ కష్టాలు..