మరాఠావాదమే శరద్ పవార్ వెనకున్న బలం మరాఠా వాదం! మహారాష్ట్రలో బాగా వినిపించే పదం. ఈ పదం వినగానే మొదట గుర్తకు వచ్చేది.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అంతగా.. ఆ సామాజికవర్గ మద్దతు కూడగట్టుకున్నారాయన. మొన్నజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54స్థానాల్లో పార్టీ విజయం సాధించిందంటే కారణం మరాఠా సామాజిక వర్గమే. పశ్చిమ మహారాష్ట్రలో వీరి జనాభా అధికంగా ఉంటుంది. ఎన్సీపీ గెలుచుకున్న 54 స్థానాల్లో దాదాపు 26 స్థానాలు పశ్చిమ మహారాష్ట్రలోనివే. అంటే.. మరాఠా వాదం ఇక్కడ ఎంతగా వేళ్లూనుకుని ఉందో అర్థం చేసుకోవచ్చు.
భావోద్వేగ ప్రసంగాలు
భాజపా.. ఈ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా తగినంత రీతిలో ఉద్యోగాలు కల్పించకపోవటంపై యువతలో అసహనం వ్యక్తమైంది. సరిగ్గా ఇదే సమయంలో తన అనుభవం రంగరించి ఆ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకున్నారు పవార్. ముఖ్యంగా ఆ వర్గం యువతను ఆకర్షించటంలో విజయం సాధించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో దిల్లీకి, మహారాష్ట్ర గౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందంటూ భావోద్వేగ ప్రసంగాలు చేశారు. ఫలితంగా మరాఠాలు ఎక్కువ మంది ఎన్‌సీపీ వైపు మొగ్గు చూపారు.
సామాజికవర్గమే కలిసొచ్చింది
ఇప్పుడీ మరాఠా వాదం చర్చకు రావటానికి కారణం.. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న కుర్చీలాటే. తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ ఇతర పార్టీల తాయిలాలకు ఆశపడకుండా ఉన్నారంటేనే వాళ్లకు శరద్ పవార్‌పై ఎంత నమ్మకం, గౌరవం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా ఈ నమ్మకమే.. ఇవాళ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా నిలువరించాయనటంలో అతిశయోక్తి లేదు. ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువభాగం మరాఠా సామాజిక వర్గానికి చెందిన వారే కావటం కలిసొచ్చిన అంశం.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంటే...పార్టీ మారితే...తమకూ ఈ పరిస్థితి తప్పదని ఎమ్మెల్యేలు భావించి ఉండొచ్చు. అందుకే శరద్ పవార్ శిబిరం నుంచి ఎలాంటి కప్పదాట్లు కనిపించలేదు. ఉన్నట్టుండి అజిత్ పవార్ రాజీనామా చేయటం వెనుక శరద్ పవార్ వ్యూహం సామాన్యమైందేమీ కాదు. అంటే...అటు మరాఠా వాదంతో పాటు...తన రాజకీయ అనుభవం తోడవటం వల్ల మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి.
పార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉంటారన్న ధీమా మొదట్నుంచీ వ్యక్తం చేస్తూనే వచ్చారు శరద్ పవార్. తన 52 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటివెన్నో చూశానని ఆయన చేసిన వ్యాఖ్యల్లో నమ్మకం ప్రతిబింబించింది. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యేలందరూ శిబిరం వీడకుండా ఉండటం శరద్ పవార్ సాధించిన విజయమే.