పంజాబ్‌లోని బఠిండాలో ఉన్న ఈ చారిత్రక కోట పేరు 'కిలా ముబారక్'. భారతదేశ చరిత్రలో ఈ కోటకు ప్రత్యేక స్థానముంది. భారీ తలుపు, నిలువెత్తు గోడలు.. కోట గొప్పదనాన్ని కళ్లకు కడతాయి. కింగ్ దాబ్ ఈ కోటను నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తారు. మొదట్లో విక్రమ్‌గఢ్ కోటగా దీన్ని పిలిచేవారు. తర్వాత కింగ్ జైపాల్.. కోట పేరు జైపాల్గఢ్గా మార్చారు. కింగ్దాబ్ వినయ్పాల్ వంశస్థుడని చెప్తారు. మొహమ్మద్ ఘజ్నవి, మొహమ్మద్ గౌరీ, పృథ్వీరాజ్ చౌహాన్ కూడా కోటపై విజయం సాధించినట్లు చెప్తారు. అందుకే ఈ కోటకు తబార్ ఈ-హింద్ అని కూడా పేరు.
"చరిత్రను తిరగేస్తే.. మొహమ్మద్ ఘజ్నవీ నగరంపై దండెత్తినప్పుడు... తొలుత అనంగ్పాల్పై దాడి చేసినట్లు తెలిసింది. ఆ దాడిలో అనంగ్పాల్ ఓడిపోవడంతో.. అవమాన భారంతో కోటలోని చితిపై దూకి తనను తాను బలిచ్చుకుంటాడు. ఈ కోటకు చాలా చరిత్ర ఉంది. కోటలోని ప్రతి మూలా, ప్రతి భాగం ఓ కథ చెప్తుంది."
- దర్శన్సింగ్ సోహి, మాల్వా హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యుడు
రజియా సుల్తానా బంధీయైంది ఇక్కడే..
భట్టీరావ్ రాజ్పుత్కిలా ముబారక్ పునరుద్ధరణ పనులు చేపట్టి, భట్టీవిందాగా కోటకు నామకరణం చేశాడు. అలా ఈ ప్రాంతానికి బఠిండా అనే పేరొచ్చింది. 1707లో గురుగోవింద్ సింగ్జీ ఈ కోటను సందర్శించినప్పుడు.. కిలా ముబారక్‌కు గోవింద్గఢ్ అని పేరుపెట్టారు. 1239లో దిల్లీ తొలి మహిళా పాలకురాలు రజియా సుల్తానా... గవర్నర్ అల్తూనియా తిరుగుబాటును ఎదుర్కునేందుకు బఠిండాకు రాగా...ఆమెను ఈ కోటలోనే బంధించారు. కోటలోని రాణీ కీ మహల్ ప్రాంతంలో రెండు నెలలపాటు ఆమె బంధీగా ఉన్నారు.
"అల్తామస్ మరణం తర్వాత.. ఆయన కుమార్తె రజియా సుల్తానా ఈ ప్రాంతాన్ని పాలించేది. మహిళా నాయకత్వాన్ని సహించలేని అన్ని రాష్ట్రాల గవర్నర్లు రజియాను వ్యతిరేకించడం ప్రారంభించారు. అత్లూనియా అయితే ఏకంగా తనను తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు. రజియాను ఇష్టపడ్డ ఆమె సైన్యాధ్యక్షుడు యాకుత్.. అత్లూనియాపై దాడిచేయగా, ఆయన్ను చంపేశారు. అనంతరం, అత్లూనియా రజియాను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. రజియా కోట నుంచి తప్పించుకుని వెళ్తుండగా.. సైనికులు వెంటాడి మరీ చంపారట."