కోదండెర మదప్ప కరియప్ప.. కేఎం కరియప్ప.. 1947 పాకిస్థాన్‌తో యుద్ధంలో భారత సేనలను నడిపించిన సేనాని. మన సైన్యానికి మొదటి భారతీయ కమాండర్- ఇన్-చీఫ్. సైన్యంలో అత్యంత అరుదైన 'ఫైవ్ స్టార్' ర్యాంకు 'ఫీల్డ్‌మార్షల్'ను అందుకున్న ఇద్దరే ఇద్దరిలో కరియప్ప ఒకరు ('ఫీల్డ్‌మార్షల్' శామ్ మానెక్‌షా మరొకరు). కరియప్ప వారసత్వాన్ని కర్ణాటక యువత సగర్వంగా అందిపుచ్చుకుంది.
దశాబ్దాలుగా వేల సంఖ్యలో కన్నడ యువకులు భారతీయ త్రివిధ దళాల్లో పనిచేశారు.. చేస్తున్నారు. అందుకే 'మార్చ్ ఆఫ్ ఏ ఫుట్ సోల్జర్' పుస్తక రచయిత, విశ్రాంత లెఫ్ట్‌నెంట్ కర్నల్ డీకే హవనూర్ 'సైన్యంలో ప్రత్యేకంగా కర్ణాటక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయవచ్చు' అంటారు.
16 మంది సైనికులు..
సైన్యంతో ఇంతగా బంధం పెనవేసుకుపోయిన ఈ రాష్ట్రంలోని బెళగావి జిల్లా ఇంచల గ్రామానికి చెందిన బాగెవాడి కుటుంబం ప్రత్యేకమైంది. 160 సభ్యులున్న ఈ ఉమ్మడి కుటుంబంలో 16 మందికి సైన్యంతో సుదీర్ఘ అనుబంధముంది. వీరిలో తొమ్మిది మంది పదవీ విరమణ చేశారు. మిగిలిన వారు వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. 1977లో బాగెవాడి కుటుంబానికి చెందిన రుద్రప్ప తొలిసారిగా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి వారసులంతా ఆయన బాటలోనే నడిచారు.