పంజాబ్ జలంధర్‌లో ఉన్న సన్‌సార్‌పుర్ గ్రామం.. హాకీ మక్కాగా పేరుపొందింది. ఈ ఊరి చరిత్ర తెలుసుకుంటే గ్రామంపై గౌరవం పెరుగుతుందనడంలో సందేహమే లేదు. 14 మంది ఒలంపిక్ ఆటగాళ్లను దేశానికి అందించిన ఏకైక గ్రామం సన్‌సార్‌పుర్. ఒలింపిక్స్‌లో పాల్గొని, ఇప్పటివరకూ భారత్‌కు 27 పతకాలు సాధించిపెట్టిన ఆటగాళ్లను పెంచిన ఊరది.
"మా ఊరి వాళ్లు బ్రిటిషర్లతో కూడా ఆడేవారు. క్రమంగా ఆటపై ఆసక్తి పెరిగి, వారితో ఆడుతూనే మాలోని నైపుణ్యాలు పెంపొందించుకున్నాం. ఇదే మైదానం నుంచి ప్రారంభించి, భారత్‌కు 14 మంది ఒలంపియన్లను ఇచ్చింది సన్‌సార్‌పుర్."
- అర్విందర్ సింగ్, ఒలంపియాన్ గుర్వేద్ సింగ్ బంధువు
అధికారుల నిర్లక్ష్యంతో..
భారత హాకీని ప్రపంచస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఓ సమయంలో ఈ ఊరి మైదానం కీలకపాత్ర పోషించింది. కానీ.. అదిప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. ప్రపంచస్థాయిలో హాకీ ప్రాభవం చాటి చెప్పిన సన్‌సార్‌పుర్.. 'ఆస్ట్రో టర్ఫ్' మైదానం కోసం ఇంకా వేచిచూస్తోంది. హాకీని అభిమానించే ఆటగాళ్ల సాధనకు ఈ ఊరి మైదానమే కేంద్రం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు కల్పిస్తే.. సన్‌సార్‌పుర్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని క్రీడాకారులు చెప్తున్నారు.
ఇదీ చదవండి:ఎంత ఎత్తున్నా సులువుగా ఎక్కేస్తాడు 'కోతిరాజ్'
"ఉన్నత ప్రమాణాలతో ఓ మంచి సమీకృత క్రీడా కేంద్రం నిర్మిస్తే బాగుంటుంది. ఈ ఊరిని ఆనుకుని ఉన్నది ఆర్మీ మైదానం. అక్కడ సాధన చేసిన పిల్లలు ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. ఆస్ట్రో టర్ఫ్ మైదానం వస్తే భవిష్యత్తులోనూ భారత్‌కు గొప్ప క్రీడాకారులను ఇవ్వగలదు మా గ్రామం."
- అర్విందర్ సింగ్, ఒలంపియాన్ గుర్వేద్ సింగ్ బంధువు
ప్రత్యేక శిక్షణ కోసం..
చరిత్రలో ఈ మైదానానికున్న ప్రత్యేకత దృష్టిలో ఉంచుకుని, పంజాబ్ ప్రభుత్వం ఔత్సాహికులకు శిక్షణనిచ్చేందుకు గానూ ఓ మహిళా శిక్షకురాలు సహా ఇద్దరు కోచ్‌లను నియమించింది. ఇతర సదుపాయాలూ కల్పిస్తోంది.