తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటవీ సంరక్షణలో 'అతడే ఒక సైన్యం' - Assam today news

అసోంలోని మారుమూల తెగకు చెందిన వ్యక్తి ఆయన. ప్రకృతి, పచ్చదనంతో ఆయనకున్న బంధం అవినాభావం. క్రమంగా తగ్గిపోతున్న అడవులు మనకూ, మనచుట్టూ ఉన్న ప్రకృతినీ ప్రమాదంలోకి నెడుతుంటే.. ఆ అడవులను సంరక్షించుకునేందుకు మౌనంగా తన పని తాను చేసుకుపోయాడు. ఆయనే జాదవ్ పాయెంగ్. ప్రకృతి సంపదను కాపాడేందుకు నిర్విరామంగా చేసిన కృషే ఆయన్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టింది.

FOREST MAN OF THE INDIA AND PADMASRI JADAV PAYENG
అటవీ సంరక్షణలో 'అతడే ఒక సైన్యం'

By

Published : Dec 9, 2020, 7:47 AM IST

అటవీ సంరక్షణలో 'అతడే ఒక సైన్యం'

1979లో కోకిలాముఖ్ సమీపంలోని చపోరాలో తగ్గిపోతున్న అడవులను తిరిగి పెంచేందుకు గాను.. గోలాఘట్ జిల్లా యంత్రాంగం ఓ ప్రాజెక్టు చేపట్టింది. జాదవ్ కూడా మొక్కలు నాటేందుకు ఓ కార్మికుడిగా అక్కడికి వెళ్లాడు. ప్రాజెక్టు పూర్తైన తర్వాత మిగతా కార్మికులంతా తిరిగి వెళ్లిపోగా.. జాదవ్ పాయెంగ్ అలియాస్ ములాయ్ మాత్రం అక్కడే ఉండి.. చెట్ల రక్షణ బాధ్యతలు చూసుకున్నాడు. ఆ ప్రాంతం పేరే ఇప్పుడు ములాయ్ కథోనీగా స్థిరపడిపోయింది.

అలా వెలుగులోకి..

అడవుల పరిరక్షణకు ములాయ్ చేస్తున్న కృషి 2009లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతే కేవలం ఒక్క మనిషే కష్టపడి.. నిర్మించిన అడవిని చూసేందుకు వందలాది మంది ములాయ్ కథోనీకి తరలి వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం వందకు పైగా ఏనుగులున్నాయి. లెక్కలేనన్ని జింకలు, నాలుగు బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. అడవుల సంరక్షణకు బాధ్యతగా నడుంబిగించిన జాదవ్ పాయెంగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది.

"1979 నుంచి అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్నా. అప్పుడు నా వయసు 14, 15 సంవత్సరాలు. అప్పటినుంచీ, ఇప్పటివరకూ ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాను."

- జాదవ్ పాయెంగ్, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా

ఫారెస్ట్​ మ్యాన్​ ఆఫ్​ ది ఇండియాగా..

2012లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం.. 'ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా' బిరుదుతో జాదవ్ పాయెంగ్​ను సత్కరించింది. అడవుల సంరక్షణకోసం ఆయన చేస్తున్న కృషికి దక్కిన గుర్తింపు అది. అదే ఏడాది ఓ కెనడా ఫొటోగ్రాఫర్ విలియన్ డోగ్లస్ మెక్మాస్టర్.. ఫారెస్ట్ మ్యాన్​ పై డాక్యుమెంటరీ చిత్రీకరించారు.

పాఠ్యాంశాల్లో పాయెంగ్​

2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది. 2015లో పాయెంగ్​ను పద్మశ్రీ పురస్కారం వరించింది. అడవులను కాపాడేందుకు ఆయన చేసిన కృషిని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చిన్నారుల పాఠ్యాంశాల్లో చేర్చింది.

"చాలాకాలం క్రితం జేబీ కళాశాలలోనే చదువుకుని అమెరికాలో ఉపాధ్యాయుడుగా స్థిరపడ్డ నబామీ శర్మ ఫేస్​బుక్​ పోస్ట్​ చూశాను. అమెరికాలో ఓ కోర్సులో.. 'ది ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ పాయెంగ్' పేరుతో ఒక చాప్టర్ ఉందని తెలిసింది. ఇదంతా చూస్తుంటే.. అసోం వాసులుగా మాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది.

- డా. బిమల్ బోరా, జేబీ కళాశాల ప్రిన్సిపల్

అమెరికా పాఠాల్లోనూ..

జాదవ్ పాయెంగ్ కథను.. 'ద ఫారెస్ట్ మ్యాన్-జాదవ్ పాయెంగ్' పేరుతో పదకొండో తరగతి పాఠ్యాంశాల్లో చేర్చింది అమెరికా ప్రభుత్వం. ప్రస్తుతం అమెరికాలోని కనెక్టికట్లో ఉన్న ది గ్రేట్ హెల్ప్స్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జోర్హట్​కు చెందిన నబామీ శర్మ ఈ విషయం చెప్తున్నారు.

"పద్మశ్రీ జాదవ్ పాయెంగ్ గురించి విద్యార్థులతో చర్చిస్తాం. పాయెంగ్​పై తీసిన రెండు డాక్యుమెంటరీలను వాళ్లు ఇష్టంగా చూస్తారు. ఆయన చేసిన కృషిపై చర్చించి, ప్రశ్నలడిగి, వారితోనే జవాబులు చెప్పిస్తాం. ఆయన గురించి తెలుసుకునేందుకు పిల్లలు ఆసక్తి చూపుతారు. నాకైతే ఎంతో గర్వంగా ఉంటుంది. అసోంకు చాలా దూరంగా ఉన్నప్పటికీ, ఆయన గురించి మాట్లాడుకుంటాం. అందరికీ చెప్తాం."

- నబామీ శర్మ, అమెరికాలోని ఎన్నారై ఉపాధ్యాయుడు

ప్రపంచ స్థాయికి ఎదిగిన మట్టిలో మాణిక్యం జాదవ్ పాయెంగ్​ పట్ల ప్రతి అసోం వాసీ గర్విస్తాడనడం అతిశయోక్తి కాదు. జాదవ్, ఆయన సృష్టించిన ములాయ్ కథోనీ.. అటవీ సంరక్షణ గురించి ప్రపంచం మాట్లాడుకున్నంత కాలం స్ఫురణకు వస్తాయి.

ఇదీ చదవండి:రాళ్లు పలికించే సుమధుర రాగాలివి!

ABOUT THE AUTHOR

...view details