ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు తప్పదా? కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
పిటిషన్లో లోపాలు
చిదంబరం తరపు న్యాయవాదులు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో లోపాలు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ విచారణకు అనుమతించలేదు. కోర్టు విచారణ జాబితాలో లేనందున కేసు వాదనలు వినడం కుదరదని జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఫలితంగా చిదంబరం బెయిల్ కొనసాగింపు పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.
అరెస్టు తప్పదా?
విచారణ వాయిదా పడడం... చిదంబరానికి ఇబ్బంది కలిగించే అంశమే. ఈడీ లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదీ జరిగింది
2007లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో... ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపునకు రూ.305 కోట్ల విదేశీ నిధులు అందాయి. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతి ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా సీబీఐ 2017 మే 15న ఐఎన్ఎక్స్ మీడియాపై కేసు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే మీడియా గ్రూపుపై 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను మంగళవారం దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రెండుసార్లు చిదంబరం ఇంటికెళ్లినా ఆయన లేకపోవడం వల్ల వెనుదిరిగారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. వెంటనే తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అదృశ్యమైన చిదంబరం... సుప్రీంకోర్టు వేదికగా న్యాయపోరాటానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: ఫేస్బుక్లో కొత్త ఫీచర్... సమాచారం మరింత భద్రం