కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. 10 మంది అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈ రోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించారు సభాపతి రమేశ్ కుమార్. రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత గడువు కావాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్.
అయితే.. సభాపతి పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని స్పీకర్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఈ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం రోజు అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టుకు ఆ హక్కు లేదు..
సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు కర్ణాటక అసెంబ్లీ సభాపతి. ఎమ్మెల్యేల రాజీనామాలకు కారణం తెలుసుకోవాల్సి ఉందని.. విచారించేందుకు సమయం పడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
"రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించడం సరికాదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చే హక్కు సుప్రీంకోర్టుకు లేదు."
-అభిషేక్ మను సింఘ్వీ, స్పీకర్ తరఫు న్యాయవాది