మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపాకు పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం.. మిత్రపక్షం శివసేనపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో సగం పదవీకాలం పంచుకోవాలంటూ డిమాండ్ చేయడం మరాఠా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనేందుకు కారణమైంది.
ఈ నేపథ్యంలో తమ డిమాండ్‌ను సమర్థించుకుంది శివసేన. భాజపా అధ్యక్షుడు అమిత్ షా- తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మధ్య ఒప్పందం(ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి సగం పదవీకాలం పంచుకోవాలి) కుదిరిందని.. ఈ విషయంపై భాజపా సత్యం మాట్లాడాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కోరారు.