తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రో'దశ' తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం! - science and technology news

మనిషి అకాశాన్నే అరచేతిలోకి తీసుకున్నాడు.. ఖగోళాన్ని తన ఆవాసంగా మలచుకుంటున్నాడు.. ఇప్పటికే విశ్వ ఆవరణంలో ఎన్నో ఉపగ్రహాలు పంపి ప్రయోజనాలు పొందుతున్నాడు. అయితే, ఈ ప్రయోగాలు ఎంతవరకు సురక్షితం? ఎలాంటి జాగ్రత్తలతో రోదసి జనహితంగా మారుతుంది?

space challenges and problems in astrology
రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

By

Published : Dec 29, 2019, 10:13 AM IST

Updated : Dec 29, 2019, 10:53 AM IST

ఓసారి నింగికేసి కళ్లు విప్పార్చి చూడండి. సుదూర వినీలాకాశంలో శాస్త్ర జగతి సాధించిన గ‘ఘన విజయాలు’ కళ్లకు కడతాయి. నేలపై సౌఖ్యంగా బతకడానికి నింగిని ప్రయోగశాలగా మార్చేసిన మనిషి మేధోశక్తి గోచరిస్తుంది. భూగోళం నుంచే ఖగోళాన్ని శాసిస్తూ.. లెక్కకు మిక్కిలి ప్రయోజనాలు పొందుతున్న అతని ప్రతిభా పాటవాలు అద్భుతం, అమోఘం.

ఉపగ్రహాల వల్ల అందివచ్చిన ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయానికి మార్గదర్శకం అవుతున్నాయి. అంతరిక్ష కాలనీలను చూడబోతున్నాం. అంతరిక్ష పరిశోధనల్ని లోక కల్యాణానికి వాడితే మనిషి జీవితం మరింత సౌకర్యవంతమవుతుంది. దుర్వినియోగం చేస్తే.. సైనిక అవసరాలకు వినియోగిస్తే.. రోదసిని ఆయుధాలతో నింపేస్తే మాత్రం పెను ప్రమాదమే. అలా జరగకుండా చూడటం, అంతరిక్షం వ్యర్థాలతో నిండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం కొత్త దశాబ్దం ముందున్న అతిపెద్ద సవాలు. వీటిని ఎలా అధిగమిస్తాం? రోదసిని మరింత జనహితంగా మలచుకోవడానికి శాస్త్ర సమాజం ఏం చేయాలి?

ఆకాశమే హద్దు!

అంతరిక్షం.. ఆవలి తీరం, అంతుచిక్కని ఓ అద్భుతం.. అరవై ఏళ్లుగా సాగుతున్న అన్వేషణం.. ఆవిష్కరణల పుష్పక విమానం.. ప్రగతిదాయక పెను మార్పుల కోసం.. శాస్త్ర సమాజం శోధిస్తున్న ప్రయోగశాల..

రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

ఎప్పటికీ ఇది అనంత ‘విశ్వ’సాగర మథనమే. ఇందులో మానవాళికి ప్రత్యక్షంగా దక్కిన ప్రయోజనం ఉపగ్రహం. ఆకాశంలో తిరుగుతూ భూమిపై ఎన్నో అంశాలను ఇవి ప్రభావితం చేస్తున్నాయి. అంతరిక్ష ప్రయోగాల కోసం రూపొందిన అనేక సాధనాలు, మిశ్రమ లోహాలు, పదార్థాలు కూడా మన రోజువారీ జీవిత రూపురేఖల్నే మార్చేశాయి. ప్రయోగాల్లో గత రెండు దశాబ్దాలుగా అమెరికా, భారత్‌, రష్యా, చైనా, జపాన్‌, ఐరోపా దేశాలు పోటీపడుతున్నాయి. ఎన్నో ప్రయోజనాలూ సాధిస్తున్నా.. కొన్ని వైఫల్యాలు శాస్త్రవేత్తల్లో పట్టుదల పెంచడమే కాకుండా.. కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఫల్యాలను నియంత్రిస్తూ.. మానవాళికి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చడం కొత్త దశాబ్దంలో సవాల్‌.

ఇవీ ప్రయోజనాలు.....

హైటెక్‌ సేద్యం

రిమోట్‌ సెన్సింగ్‌, జీపీఎస్‌, కృత్రిమ మేధ పరిజ్ఞానాలను కలగలపడం ద్వారా ‘ప్రిసిషన్‌ ఫార్మింగ్‌’కు వీలు కలుగుతుంది. నేల స్వభావం, వాతావరణంపై ఉపగ్రహాలు సేకరించిన డేటాతో భవిష్యత్తులో వ్యవసాయం సులువవుతుంది.

అంతరిక్ష కాలనీలు

అంతరిక్ష పరిజ్ఞానంలో జోరు పెరగడంతో సైన్స్‌ కాల్పనిక సాహిత్యం వాస్తవరూపం దాలుస్తోంది. స్పేస్‌ఎక్స్‌ వంటి కంపెనీల రాకతో కొత్త ఆవిష్కరణలొస్తున్నాయి. అంతరిక్ష పర్యాటకం, మైనింగ్‌, కాలనీల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

సామాన్యులకు చేరువ

అంతరిక్ష పరిజ్ఞానాన్ని సామాన్యుల రోజువారీ అవసరాలకు మళ్లిస్తున్నారు. ఇలాంటివి 2 వేలకుపైగా ఉన్నాయి. తేలికపాటి ఇన్సులేషన్‌, డయాలసిస్‌ సాధనాలు, నీటి శుద్ధి, ఆటోమేటెడ్‌ క్రెడిట్‌ కార్డు లావాదేవీలు వంటివి ఉదాహరణలు.

సౌర‘శక్తి’

అంతరిక్షంలో భూ వాతావరణ ‘వడపోత’ లేకుండా సౌరశక్తి లభిస్తుంది. అక్కడ ఏడాదిలో నిరంతరం సూర్యకాంతి లభిస్తుంది. అందువల్ల కక్ష్యలోకి సౌర ఫలకాలను పంపి, సౌరశక్తిని ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదన ఉంది.

‘శాస్త్ర’ సమాజం ఏం చేయాలి?

‘విశ్వ’ ప్రగతి.. శాంతి

రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

అంతరిక్ష సామర్థ్య దేశాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ రంగాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమూ పెరుగుతోంది. సైనిక అవసరాలకు దీన్ని ఉపయోగించకుండా చూడాలి. రోదసిని ఆయుధాలతో నింపేయకుండా, భవిష్యత్తు యుద్ధాలకు అది అడ్డా కాకుండా చూడాలి. శాంతి, అభివృద్ధి అవసరాలకే వేదికయ్యేలా పటిష్ఠ అంతర్జాతీయ ఒప్పందాలు అవసరం. రోదసిని శాంతియుత అవసరాలకు ఉపయోగించడానికి 1967లో ఔటర్‌ స్పేస్‌ ఒప్పందం, తర్వాత ఐరాస ఆధ్వర్యంలో మరో 4 ఒప్పందాలు ఖరారయ్యాయి. నాటికి ప్రభుత్వాలే అంతరిక్ష ప్రయోగాలు చేసేవి. వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేలా కొత్త ఒప్పందాలు, చట్టాలు అవసరం.

కొత్త ‘తరం’గం

రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

అంతరిక్ష ప్రయోగ ఖర్చులు ఇంకా భరించలేని స్థాయిలోనే ఉన్నాయి. పునర్వినియోగ రాకెట్లు, కొత్త తరం రాకెట్‌ పరిజ్ఞానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి. ధరలు ఎంత తగ్గితే అంత ఎక్కువగా అంతరిక్ష రంగంతో ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. అలాగే రోదసి పరిజ్ఞాన సంక్లిష్టతల దృష్ట్యా వాటికి భారీగా నిధులు అవసరం. ప్రభుత్వాల వైపు నుంచి కేటాయింపులు పెరగాలి.

ప్రమాద రహిత ‘యానం’

రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

అంతరిక్షయానం మానవులకు ఇప్పటికీ ఒకింత ప్రమాదభరితంగానే ఉంది. దీర్ఘకాల రోదసి ప్రయాణాల వల్ల వ్యోమగాములపై శారీరకంగా, మానసికంగా ప్రభావం పడుతోంది. వీటిని అధిగమించేందుకు సరికొత్త ఉపకరణాలు, చికిత్స విధానాలు రావాలి. ఉపగ్రహాల బరువు తగ్గాలి. కొత్తరకం మిశ్రమ లోహాలు, తేలికపాటి పదార్థాలను అభివృద్ధిచేయాలి.

వ్యర్థాలు.. అనర్థాలు

రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

రోదసి రంగంలోకి వస్తున్న ప్రైవేటు కంపెనీల సంఖ్య పెరగడం, ఉపగ్రహాలకు డిమాండ్‌ వంటి కారణాల వల్ల కక్ష్యలో వ్యర్థాలు బాగా పేరుకుపోతున్నాయి. గంటకు 20 వేల కిలోమీటర్ల వేగంతో తిరిగే ఈ శకలాల వల్ల ఉపగ్రహాలు, మానవసహిత యాత్రలకు ప్రమాదం పొంచి ఉంది. వీటిని తొలగించేందుకు గట్టి విధానాలు అవసరం.

శాటిలైట్‌ సెంచరీ కొట్టేదాకా..

రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

కమ్యూనికేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, నేవిగేషన్‌ కోసం భారత్‌ వద్ద ప్రస్తుతం దాదాపు 50 ఉపగ్రహాలున్నాయి. దేశీయ అవసరాలు తీరాలంటే మరో 50 వరకూ శాటిలైట్లు అవసరం. ప్రస్తుతం విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈమేరకు ఉపగ్రహ తయారీ, ప్రయోగాలను బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఏటా 18 ప్రయోగాలను చేపట్టాలి. దాదాపు 6 వేల టన్నుల బరువుండే అధిక సామర్థ్య ఉపగ్రహాల సంఖ్యను పెంచాలి. రోదసి పరిజ్ఞానం ద్వారా కమ్యూనికేషన్లు, వాతావరణ అంచనాల సేవల విషయంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. అయితే పశ్చిమ, తూర్పు ఆసియా దేశాలతో పోలిస్తే సాధించాల్సింది చాలా ఉంది.

రాకెట్ల వేగం పెరగాలి

- మనస్వి లింగం, ఖగోళ శాస్త్రవేత్త

రోదసి పరిజ్ఞానం ద్వారా కమ్యూనికేషన్లు, వాతావరణ అంచనాల సేవల విషయంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. పునర్వినియోగ రాకెట్ల ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించడంపై దృష్టి ఉంది. ప్రస్తుతం రాకెట్లు గరిష్ఠంగా సెకనుకు 20 కి.మీల వేగాన్ని అందుకోగలుగుతున్నాయి. విద్యుత్‌, అయస్కాంత, విద్యుదయస్కాంత తెరచాపలు వంటి వినూత్న చోదక వ్యవస్థలను ఉపయోగిస్తే సెకనుకు 100-200 కిలోమీటర్ల వేగాన్ని సాధించవచ్చు.

- మనస్వి లింగం, ఖగోళ శాస్త్రవేత్త, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, అమెరికా

ప్రపంచ అంతరిక్ష పరిశ్రమ ప్రస్తుత విలువ 40,000 కోట్ల డాలర్లు
2030 నాటికి 80,500 కోట్ల డాలర్లకు చేరొచ్చు

ఇదీ చదవండి:ఆరుపదుల వయసులో ఏడడుగుల బంధంతో..!

Last Updated : Dec 29, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details