లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులను సొంతూళ్లకు పంపించి ప్రజల ఆదరణ చూరగొన్న నటుడు సోనూసూద్‌పై శివసేన నేత సంజయ్‌రౌత్ విమర్శలు ఎక్కుపెట్టారు. సోనూసూద్‌ను భాజపా చేతిలో కీలుబొమ్మగా అభివర్ణిస్తూ శివసేన పత్రిక సామ్నాలో సంజయ్‌రౌత్ వ్యాసం రాశారు. శివసేనను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే సోనూసూద్‌ను భాజపా తెరపైకి తీసుకొచ్చిందని సంజయ్‌రౌత్ ఆరోపించారు. త్వరలోనే సోనూసూద్ ప్రధానిని కలిసి ‘ఆ పార్టీకి’ ప్రచారం కూడా చేస్తారని రౌత్ జోస్యం చెప్పారు.
సంజయ్‌రౌత్ సామ్నాలో సోనూసూద్ గురించి వర్ణిస్తూ లాక్‌డౌన్ కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడని వ్యంగాస్త్రాలు సంధించారు.
" సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మహారాష్ట్ర సంప్రదాయంలోనే ఉంది. మహాత్మా జ్యోతిరావ్‌ఫులే, బాబా ఆమ్టే, ఈ రాష్ట్రానికి చెందిన వారే. ప్రస్తుతం ఈ జాబితాలోకి కొత్తపేరు వచ్చి చేరింది. ఆ పేరే సోనూసూద్. మండుటెండలో ఆయన వలస కార్మికులకు సాయం చేయడం వీడియోల్లో కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సోనూసూద్ పేరుతో కొత్త మహాత్మ కనిపిస్తున్నారు. గత పక్షం రోజులుగా ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, దిల్లీ, ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులను సొంతూళ్లకు పంపిస్తున్నారు. రాష్ట్రం, కేంద్రప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసిన సందర్భంలోనే సోనూసూద్ వలస కార్మికులకు సహాయం చేస్తున్నట్లుగా ఉంది. సోనూసూద్ పనిని గుర్తిస్తూ కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర గవర్నర్ కూడా 'మహాత్మ సూద్'ను ప్రశంసించారు.