దిల్లీకి రాజైనా, కాకపోయినా... తల్లికి మాత్రం కొడుకు మహారాజే! గర్భం నుంచే పోరాటం నేర్పే ఆ తల్లి, ఎదిగాక ఎదురయ్యే సవాళ్లకు ఎదురీదడమూ నేర్పుతుంది. ఈ మాటలను మరో సారి రుజువు చేసింది రాజస్థాన్ చురూ జిల్లాలోని ఓ తల్లి. మానసిక స్థితి సరిగ్గా లేని తన బిడ్డ సమస్యకు పరిష్కారం వెతకడమే కాదు... 'మధుర్ దివ్యాంగుల పాఠశాల'ను ఏర్పాటు చేసి తన కుమారుడిలా బాధపడే ఎందరికో దారి చూపుతోంది అంజు నెహ్రా.
"నా మనసులో ఉన్నది ఒక్కటే.. నేను స్వయంగా ఓ దివ్యాంగుడికి తల్లిని. నా కుమారుడిని ప్రత్యేక స్కూలుకు పంపించాకే తనలో మార్పు వచ్చింది. అప్పుడే నాకు అనిపించింది.. చురూ జిల్లాలోని దివ్యాంగుల కోసం ఓ ప్రత్యేక పాఠశాలను తెరవాలని."
-అంజు నెహ్రా
ఆ బాధను అర్థం చేసుకుని...
మధుర్ పుట్టినపుడు అంజు జీవితంలో సంతోషాలు విరబూశాయి. అయితే, పెరిగే కొద్దీ కుమారుడి మానసిక స్థితి సరిగ్గా లేదని తెలిసి.. కుంగిపోయింది అంజు. కానీ, అధైర్యపడలేదు. కుమారుడి ప్రత్యేక అవసరాలు అర్థం చేసుకుంది. అతడిని ప్రత్యేక దివ్యాంగుల పాఠశాలలో చేర్చింది. కొడుకు కోసం.. ముంబయిలో మానసిక వికలాంగులకు బోధన చేసేందుకు శిక్షణ పొందింది.
మానసిక వైకల్యంతో తన కుమారుడు పడిన ఇబ్బందులను కళ్లారా చూసిన అంజూ నెహ్రా.. తన కుమారుడిలా బాధపడేవారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. 2013లో తనయుడి పేరు మీదే 'మధుర్ దివ్యాంగుల పాఠశాల' ను తెరిచింది. విశ్రాంత నౌకాదళ అధికారి అయిన భర్తకు వచ్చే ఫించనులో సింహభాగం ఈ బడికే ఖర్చు చేస్తూ... విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా ఉచిత విద్య అందిస్తోంది.