దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జిల సమావేశంలో ప్రసంగించిన సోనియా.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్దమైన బాధ్యతలను నిర్విర్తించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.
కరోనా కట్టడిలో విఫలమయ్యారని, ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, దళితులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు సోనియా. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార వాటాను ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోందని, పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏవిధంగా సహాయం చేయగలవని ప్రశ్నించారు సోనియా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
"తోటి భారతీయులు, కాంగ్రెస్ ప్రభుత్వం శ్రమించి నిర్మించిన భారత ఆర్థిక వ్యవస్థను భాజపా ప్రభుత్వం ఏకకాలంలో కూల్చి వేసింది. దేశ జీడీపీ ఇంతగా దిగజారడం చరిత్రలోనే లేదు. ఈ రోజు యువతకు ఉద్యోగాలు లేవు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చి వారిపై కోలుకోలేని దెబ్బ వేసింది. హరిత విప్లవం’ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రే ఇది. దీని ప్రభావం కోట్లాది మంది రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులపై పడుతుంది."