మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ మధ్యంతర అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలు గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఉద్ధవ్‌కు లేఖ రాశారు సోనియా. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేఖలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
"భాజపా కారణంగా దేశం ఎన్నడూ లేని ముప్పుల్ని ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఏకతాటిపైకి రావాల్సి వచ్చింది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితమైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నాయి. ఈ ప్రణాళికను మూడు పార్టీలు చిత్తశుద్ధితో అమలు చేసి, ప్రజల అంచనాలను అందుకుంటాయని విశ్వసిస్తున్నా."-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
మన్మోహన్...
ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతున్నందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఠాక్రే నాయకత్వాన్ని అభినందించిన మన్మోహన్... ఉద్ధవ్ సహా మంత్రివర్గ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రాహుల్...
ప్రమాణస్వీకార మహోత్సవానికి గైర్హాజరైనందుకు చింతించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న ఉద్ధవ్ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలిపారు. భాజపాపై విమర్శలు సంధించిన ఆయన... మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచికగా అభివర్ణించారు.
"ప్రమాణస్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు నా అభినందనలు. కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసిన భాజపాను మహా వికాస్ అఘాడీ ఓడించినందుకు చాలా సంతోషం. కూటమిపై మహారాష్ట్ర ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ సుస్థిర, పేద ప్రజల అనుకూల ప్రభుత్వాన్ని అందిస్తారనే నమ్మకం ఉంది.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత