మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ. పీవీ శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణలను కొనియాడారు.
" ఆధునిక భారత దేశ రూపకల్పనకు పీవీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఘనతలు సాధించారు. ఎంతో సహకారం అందించారు. సాధారణ రాజకీయ నేత నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారు. ఆయన నాయకత్వంలో దేశం ఎన్నో కఠిన సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది. 1991, జూలై 24 నాటి కేంద్ర బడ్జెట్ మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసింది"
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి.
ఆర్థిక సంస్కరణలు..
పీవీ నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహుడిగా అభివర్ణించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన దూరదృష్టి, ధైర్యసాహసాల వల్లే దేశం క్లిష్ట పరిస్థితులను అధిగమించి అభివృద్ధి పథంలో సాగిందని గుర్తు చేశారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు సింగ్. 1991 జులై 24న ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేసిందన్నారు. అదే తేదీన పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కావడం యాదృచ్ఛికమన్నారు మన్మోహన్.
పీవీ శతజయంతి వేడుకలను జులై 24నుంచి ఏడాది పాటు నిర్వహించనుంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పీవీ సేవలను స్మరించుకున్నారు సోనియా, రాహుల్, మన్మోహన్.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారత దేశ అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తుల గురించి నేటి తరం యువత తెలుసుకుంటారని రాహుల్ గాంధీ అన్నారు. దేశం కోసం పీవీ అంకితభావంతో చేసిన కృషి ఆదర్శమని కొనియాడారు.
ఇదీ చూడండి: కరోనా ట్యాబ్లెట్ ఫవిపిరవిర్ ఇక మరింత చౌక!