ఆధునిక బిహార్ నిర్మాణానికి మహా కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో సోనియా వీడియో సందేశాన్ని.. రాహుల్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. నితీశ్‌కుమార్ పాలనలో బిహార్ సంక్షోభంలో కూరుకుపోయిందన్న ఆమె.. దళితులు, బలహీనవర్గాల ప్రజలు నిరంతర అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిహార్ ఎన్నికలకు ముందు సోనియా వీడియో సందేశం - కాంగ్రెస్ అధ్యక్షురాలు
బిహార్ ఎన్నికలకు ఒకరోజు ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బిహార్ అభివృద్ధి కోసం.. మహాకూటమి అభ్యర్థులకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నితీశ్ కుమార్ పాలనలో బలహీనవర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.
''ప్రస్తుతం బిహార్ ప్రభుత్వం అహంకారంలో మునిగిపోయింది. కార్మికులు నిస్సహాయంగా ఉన్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారు. యువత నిరాశలో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం సామాన్య ప్రజల జీవితాలపై భారం మోపుతోంది. కేంద్రం, నూతన బిహార్ నిర్మాణానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నూతన అధ్యాయం లిఖించేందుకు సమయం ఆసన్నమైంది. చీకటి నుంచి వెలుగు కోసం.. అబద్దం నుంచి నిజం కోసం.. వర్తమానం నుంచి భవిష్యత్తు కోసం మహా కూటమి అభ్యర్థులకు ఓటు వేయండి. నవ బిహార్ నిర్మాణానికి దోహదపడండి.''
- సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత్రి