కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సోమవారం ఆమె 73వ పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు, సంబరాలు చేసుకునే యోచనలో లేనట్లు తెలుస్తోంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
సమాజాన్ని కలచివేసిన దిశ, ఉన్నావ్ ఘటనలతో పాటు దేశ నలుమూలలా ఆడపిల్లలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతుండటంపై సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీపై విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విరుచుకుపడింది కాంగ్రెస్. దేశంలో శాంతి భద్రతలు లోపిస్తున్నా.. ప్రధాని మాత్రం నోరుమెదపడం లేదని ఆరోపించింది.
ప్రపంచ అత్యాచార రాజధానిగా భారత్ పేరు పొందిందని.. దీనంతటికి కారణం ప్రధాని మోదీయే అని రాహుల్ గాంధీ.. మండిపడ్డ మరుసటి రోజే.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ విరుచుకుపడ్డ ఓ వీడియోను పోస్ట్ చేశారు సుర్జేవాలా. 'అప్పుడు మా ప్రభుత్వాన్ని నిలదీశారు మరి మీ ప్రభుత్వం ఏం చేస్తోందని' ఆయన ప్రశ్నించారు.
"ఉన్నావ్, ఈటవా, హైదరాబాద్, పాల్వాల్-ఫరీదాబాద్.. దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచార బాధితులు న్యాయం కోసం రోదిస్తున్నారు. బలహీనమైన చట్టాల వల్ల నేరస్థులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ మోదీజీ మాత్రం నోరు తెరవడం లేదు. పశ్చాత్తాపం లేదు, ఒక్క మాట కూడా లేదు. కానీ ప్రధానిని ఎవరూ ప్రశ్నించరు.. ఎందుకు? "
-రణదీప్ సుర్జేవాలా ట్వీట్
ఇదీ చదవండి:వేదికపై పాట పాడి.. అదిరిపోయే స్టెప్పులేసిన ఎమ్మెల్యే